లోకేష్‌ తో పోటీ...బాబు బీపీ పెంచేస్తున్న మంత్రి

Update: 2018-07-16 13:53 GMT
నోరుతెరిస్తే...క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారు పేరు మా పార్టీ అని చెప్ప‌డం తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు అల‌వాటు. అన్నీ మా నాయ‌కుడు చూసుకుంటాడ‌ని - చంద్ర‌బాబు సార‌థ్యంలోనే అన్నీ జ‌రుగుతాయ‌ని పార్టీ నేత‌లు చెప్తుంటారు. అయితే పార్టీలో అలాంటిదేమీ లేద‌ని...ఎవ‌రికి తోచింది వారు చేస్తుంటార‌ని, ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే..చంద్ర‌బాబు చేయాల్సిన ప‌నులు కూడా పార్టీ నేత‌లు చేస్తున్నారని అంటున్నారు. పార్టీ అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించాల్సిన అభ్య‌ర్థుల జాబితాను...ఆయ‌న త‌న‌యుడి హోదాలో మంత్రి నారా లోకేష్ ప్ర‌క‌టించేశారు. ఇదేం చిత్ర‌మ‌ని - పైగా పార్టీ నాయ‌కుడు చేయాల్సిన ప‌నిని ఈయ‌న చేయడం ఏంట‌ని టీడీపీకి చెందిని ఎంపీ టీజీ వెంక‌టేశ్ ప్ర‌శ్నించారు.

క‌ర్నూలులో అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ద్వారా నెల‌కొన్న క‌ల‌క‌లం తెలుగుదేశం పార్టీ శ్రేణుల‌నే అయోమ‌యానికి గురి చేసిన సంగ‌తి తెలిసిందే. పార్టీ నాయ‌కుడు చేయాల్సిన ప్ర‌క‌ట‌న - నాయ‌కుల‌తో సంప్ర‌దింపులు లేకుండా చేసేయ‌డం ఏంట‌ని చ‌ర్చ జ‌రిగింది. పార్టీ ఎంపీ వ‌ర్సెస్‌ - జంపింగ్ ఎంపీ మాట‌ల యుద్ధం కొన‌సాగ‌డం ఇందులో త‌న త‌న‌యుడు లోకేష్ ప్ర‌క‌ట‌న ఉండటంతో చంద్ర‌బాబు ఇబ్బంది ప‌డ్డార‌ని చ‌ర్చ ఉంది. అయితే, ఈ వివాదం ఇలా కొన‌సాగుతుండగానే తాజాగా చంద్ర‌బాబు స‌న్నిహితుడు - పార్టీలో సీనియ‌ర్ అనే పేరున్న మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఇంకో ప్ర‌క‌ట‌న చేశారు. ఇంకో జిల్లాలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి క‌ల‌క‌లం సృష్టించారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ...రాజానగరం ఎమ్మెల్యేగా పెందుర్తి వెంకటేష్ ను తిరిగి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉన్నదంటూ జనానికి సందేశం ఇచ్చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా ఎమ్మెల్యేలందరికీ మళ్లీ సీట్లు దాదాపు ఖరారే అంటూ హామీలిచ్చారు. దీంతో పార్టీలో చంద్ర‌బాబు తీసుకోవాల్సిన నిర్ణ‌యం మంత్రుల హోదాలో వెల్ల‌డిస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ ప‌రంగా శ్ర‌మిస్తూ రాబోయే ఎన్నిక‌ల్లో చాన్స్ దొరుకుతుంద‌ని భావిస్తున్న నాయ‌కులు ఈ ప్ర‌క‌ట‌నతో నారాజ్ అయ్యార‌ని అంటున్నారు.

Tags:    

Similar News