వైసీపీలోకి వంశీ..యార్లగడ్డ ఏమంటున్నారంటే?

Update: 2019-10-26 13:46 GMT
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని నిన్నట్నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. వంశీ మాత్రం దీపావళి వెళ్లిన తర్వాత మాట్లాడతానంటూ సంచలన ప్రకటన చేశారు. తెర వెనుక రాజకీయం చూస్తుంటే.. వైసీపీలోకి వంశీ ఎంట్రీ ఖాయంగానే కనిపిస్తోందనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో వంశీతో ఢీ అంటే ఢీ అంటూ సాగిన గన్నవరం వైసీపీ కన్వీనర్ - మొన్నటి ఎన్నికల్లో గన్నవరం వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన యార్లగడ్డ వెంకట్రావు ఎలా స్పందిస్తారన్నది నిజంగానే ఆసక్తి రేకెత్తించే అంశమే. ఎందుకంటే... ఎన్నికలకు ముందు తాను గెలిస్తే... యార్లగడ్డకు సన్మానం చేస్తానంటూ వంశీ సంచలన ప్రకటనలు కూడా చేశారు. ఈ ప్రకటనలను ఆధారంగా చేసుకుని యార్లగడ్డ ఏకంగా వంశీపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మొత్తంగా గన్నవరంలో రాజీలేని ప్రత్యర్థులుగా సాగిన వంశీ - వెంకట్రావులు ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటే పరిస్థితి కాస్తంత ఆసక్తికరమే కదా.

అందుకే వైసీపీలోకి వంశీ చేరికపై యార్లగడ్డ స్పందనపై అత్యంత ఆసక్తి నెలకొంది. నిన్న రాత్రి పొద్దుపోయే దాకా అసలు ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించిన యార్లగడ్డ శనివారం ఎట్టకేలకు నోరు విప్పారు. వంశీ రాకను తాను స్వాగతించడం అంటూ ఉండదని చెబుతూనే... సీఎం జగన్ తో భేటీ తర్వాతే ఈ విషయంపై పూర్తి స్థాయిలో స్పందిస్తానని కూడా యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయినా వైసీపీలోకి వంశీ చేరికపై యార్లగడ్డ ఏమన్నారంటే... ‘‘వంశీపై నేను ఎప్పుడూ తప్పుడు కేసులు పెట్టలేదు. ఇళ్ల పట్టాల విషయంలో రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌ను కలిసి గన్నవరంలో పరిణామాలన్ని వివరిస్తాను. వైసీపీలో వంశీ చేరికపై జగన్‌ను కలిశాక స్పందిస్తాం. వంశీ వల్ల వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వంశీ చేరికను నియోజకవర్గ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు’ అని వెంకట్రావు చెప్పుకొచ్చారు.

చూస్తుంటే... వైసీపీలోకి వంశీ చేరికను యార్లగడ్డ పూర్తిగానే వ్యతిరేకిస్తున్నట్టుగానే ఉందని చెప్పక తప్పదు. టీడీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యే హోదాలో వంశీ... వైసీపీ కార్యకర్తలను పెట్టిన ఇబ్బందులను యార్లగడ్డ గుర్తు చేస్తున్నారంటే... వంశీ చేరికను ఆయన వ్యతిరేకిస్తున్నట్లే కదా. మరి ఇద్దరు మంత్రులు స్వయంగా వంశీని వెంటబెట్టుకుని మరీ జగన్ వద్దకు తీసుకెళితే... జగన్ కూడా వంశీ రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే... జగన్ పెట్టిన రాజీనామా నిబంధనకు వంశీ కూడా జై కొడితే... ఇప్పుడు యార్లగడ్డ అభ్యంతరాలు... వైసీపీలోకి వంశీ చేరికను ఆపుతాయా? అన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. చూద్దాం... మరి ఏం జరుగుతుందో?


Tags:    

Similar News