మోడీని వెంటాడుతున్న బీజీపీ ‘సింహా’లు

Update: 2017-09-29 04:36 GMT
మోడీ అంటే బీజేపీ - బీజేపీ అంటే మోడీ అన్నట్లుగా సాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీకి పార్టీలోని రెండు ‘సింహా’ల భయం పీడిస్తోంది. ఆ రెండు సింహాల్లో ఒకరు శత్రుఘ్న సిన్హా కాగా రెండోవారు యశ్వంత్ సిన్హా. ఇద్దరూ ఇద్దరే. శత్రుఘ్న ఫైర్ బ్రాండ్ అయితే - యశ్వంత్ అపర మేధావి. మోడీ విధానాలను ఇద్దరూ వ్యతిరేకిస్తున్నారు. 2014 ఎన్నికల నాటి నుంచే శత్రుఘ్న నిత్యం మోడీపై విరుచుకుపడుతున్నారు... మరోవైపు యశ్వంత్ సిన్హా కూడా సమయమొచ్చినప్పుడల్లా మోడీ - ఆయన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల వైఫల్యాలపై గర్జిస్తున్నారు. తాజాగా ఆయన మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా కుదేలు చేస్తున్నది విశ్లేషించడం సంచలనంగా మారిన తెలిసిందే.
    
పెద్ద నోట్ల రద్దు - జీఎస్టీ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా మారిందని, క్రమంగా క్షీణిస్తోందని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. ఇదే అదనుగా శతృఘ్నసిన్హా కూడా మరోసారి తన గళం వినిపించారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికారు.  యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాల్సిన అవసరం లేదని, ఆయన బాగా ఆలోచించే తన అభిప్రాయాలు వెల్లడించారంటూ మద్దతు పలికారు. జాతీయ ప్రయోజనాలతో పాటు, పార్టీ ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని విమర్శించే వాళ్లు గ్రహించాల్సిన అవసరముందని హితవు పలికారు.
    
శత్రుఘ్న ఇంతకు ముందు కూడా పలుమార్లు మోడీపై విరుచుకుపడ్డారు.  పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్నప్పుడే ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మోడీ సర్వేలనూ ఆయన విమర్శించారు. అవన్నీ తప్పుడు సర్వేలంటూ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ పిచ్చోళ్ల స్వర్గంలో విహరించడం మానుకోండి. కట్టుకథలు - స్వప్రయోజనాల కోసం నిర్వహించిన సర్వేలకు దూరంగా ఉండండి’ అంటూ ఆయ‌న గతంలో ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. బీహార్ లో బీజేపీ ఓడిపోయినప్పుడూ ఆయన మోడీపై విమర్శలు గుప్పించారు. ఓటమి బాధ్యత నుంచి తప్పించుకోవడానికి చూస్తున్న వారికి అగ్ర పదవులలో కొనసాగే అర్హత ఉండదన్నారు.
    
ఇలా ఇద్దరు సిన్హాలు మోడీకి చుక్కలు చూపిస్తున్నారు. విపక్ష నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా నోరు మూయిస్తున్న మోడీ అనుచర గణం వీరిని మాత్రం ఏమీ చేయలేకపోతోంది. పైగా యశ్వంత్ వాజపేయి హయాంలో రెండుసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడు కావడంతో ఆయన విశ్లేషణలను ఎవరూ కొట్టిపారేయలేకపోతున్నారు.
Tags:    

Similar News