బీపీఎల్ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి

Update: 2016-05-22 08:57 GMT
ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎమ్మెల్యేలు - మంత్రులే కోట్ల‌కు పడ‌గ‌లెత్తిపోయారు. అలాంటిది కేంద్ర మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన వారికి ఎంతటి ఆస్తిపాస్తులు ఉంటాయో చెప్ప‌క్క‌ర్లేదు. అందులోనూ ఆర్థిక శాఖ వంటి కీల‌క శాఖను నిర్వ‌హించిన వారికి, ప్ర‌స్తుతం కేంద్ర స‌హాయ‌ మంత్రి హోదాలో ఉన్న నాయకుడి తండ్రి దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి జాబితా (బీపీఎల్‌)లో ఉంటారా? ఇది నిజంగా సాధ్య‌మ‌య్యేదేనా?  కానీ సాధ్య‌మైంది. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా వ‌ల్ల ఈ వింత సంఘట‌న చోటుచేసుకుంది.

2011లో దేశవ్యాప్తంగా ప్రభుత్వం జనగణన చేపట్టింది. జనాభా ఆర్థిక స్థితిగతులతో పాటు పలు అంశాల వారీగా వివరాలను సేకరించారు. జాబితా తయారయ్యాక గ్రామసభలో ఆమోదించాలి. దాన్ని బ్లాక్‌ డెవలప్‌ మెంట్‌ ఆఫీసర్‌ - కలెక్టర్ల ఆమోద ముద్రపడ్డాక తుది జాబితాను ప్రకటించాలి. దీని ఆధారంగానే అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వపరంగా పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అయితే ఈ ప్ర‌క్రియ ద్వారా తేల్చిన లిస్ట్‌ లోకి కేంద్ర మంత్రిగా ప‌నిచేసిన య‌శ్వంత్‌ సిన్హా పేరు వ‌చ్చి చేరింది. య‌శ్వంత్‌ సిన్హా కుటుంబం పేదరికం ప‌రిధిలో ఉన్న‌దేం కాదు. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగిగా యశ్వంత్‌ సిన్హా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. రెండుమార్లు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో పాటు ఆయన తనయుడు జయంత్‌ సిన్హా ప్రస్తుతం నరేంద్రమోడీ క్యాబినెట్‌ లో సహాయ‌మంత్రిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో య‌శ్వంత్ సిన్హా పేరు దారిద్ర‌రేఖ దిగువన ఉన్న‌వారి జాబితాలో ఉండ‌టం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఓవైపు ప్రభుత్వం నుంచి లభించే సబ్సి డీలను వదులుకోవాలని దేశ ప్రజలను ఎన్డీయే ప్రభుత్వం కోరుతుంటే.. మరోవైపు యశ్వంత్‌ సిన్హా బీపీఎల్‌ కింద లబ్దిపొందారా? ఒకవేళ నిజంగానే ఆయన లబ్ది పొంది ఉంటే మోడీ ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇంత‌కీ ఈ విష‌యం ఎలా బ‌య‌ట‌కువ‌చ్చింద‌నే క‌దా సందేహం? ఇటీవ‌ల ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద లబ్దిదారుల జాబితా తయారీ కోసం హజారీబాగ్‌ లోని జనగణన అధికారులు ప్ర‌జ‌ల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజారీబాగ్‌లోని హుపాద పంచాయతీలోని 252 నెంబరులో యశ్వంత్‌ సిన్హా పేరు కనిపించింది. తండ్రి పేరు విపిన్‌ బీహారీ శరద్‌ - తల్లిపేరు ధనాదేవిగా గుర్తించారు. చిత్రంగా ఇవి సిన్హా వివ‌రాలే కావ‌డం ఆస‌క్తిక‌రం. ఈ ప‌రిణామంపై  హజారీబాగ్‌ డిప్యూటీ కమిషనర్‌ ముకేష్‌ కుమార్ మాట్లాడుతూ..ఇందులో పొరపాటు జరిగి ఉండొచ్చని తెలిపారు.
Tags:    

Similar News