ఓడిపోగానే ఈ నేతకు రాజకీయాలపై ఇంత విరక్తి వచ్చిందా?

Update: 2022-07-26 08:05 GMT
కొద్ది రోజుల క్రితం జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల త‌ర‌ఫున పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు.. య‌శ్వంత్ సిన్హా. ప్ర‌తిప‌క్షాల్లోనే ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. శివ‌సేన‌, జార్ఖండ్ ముక్తి మోర్చా, జేడీఎస్ వంటి బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌తోపాటు బిజూ జ‌న‌తాదళ్, టీడీపీ, వైఎస్సార్సీపీ వంటి పార్టీలు కూడా ద్రౌప‌ది ముర్ముకే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. దీంతో య‌శ్వంత్ సిన్హా ఓడిపోక త‌ప్ప‌లేదు.

కాగా య‌శ్వంత్ సిన్హా బిహార్ కు చెందిన‌వారు. గ‌తంలో ఐఏఎస్ ఆఫీస‌ర్ గా ఉంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. బిహారిలోని హ‌జారీబాగ్ నుంచి బీజేపీ త‌ర‌ఫున లోక్ స‌భ ఎంపీగా ప‌నిచేశారు. గ‌తంలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగానూ ఉన్నారు.

అంతేకాకుండా అట‌ల్ బిహార్ వాజ్‌పేయి ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రిగా య‌శ్వంత్ సిన్హా చ‌క్రం తిప్పారు. ఆ త‌ర్వాత న‌రేంద్ర మోడీ ప్ర‌ధాని అయ్యాక బీజేపీ విధానాల‌తో విభేదించి ఆ పార్టీకి దూర‌మ‌య్యారు. త‌ర్వాత మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో పోటీ చేసే వ‌ర‌కు తృణ‌మూల్ కాంగ్రెస్ కు జాతీయ ఉపాధ్య‌క్షుడిగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇటీవలే తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు సిన్హా.  

ప్ర‌తిప‌క్షాల త‌ర‌ఫున గోపాల‌కృష్ణ గాంధీ, ప‌రూఖ్ అబ్దుల్లా ఇలా ప‌లువురిని రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప‌రిశీలించారు. అయితే వారు తిర‌స్క‌రించ‌డంతో మ‌మ‌తా బెన‌ర్జీ.. య‌శ్వంత్ ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేశారు. అయితే ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో ఆయన విపక్షాల తీరుపై గుర్రుగా ఉన్నార‌ని చెబుతున్నారు. తాజాగా మ‌ళ్లీ పొలిటికల్‌ రీఎంట్రీ ఇవ్వ‌డంపై ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శన‌మ‌ని అంటున్నారు.

తాను ఏ పార్టీలోనూ చేరబోనని, స్వతంత్రంగానే ఉంటానని య‌శ్వంత్ సిన్హా స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. భవిష్యత్తులో ప్రజాసేవలో ఎలాంటి పాత్ర పోషించాలనే అంశంపైనా నిర్ణయం తీసుకోలేద‌ని య‌శ్వంత్ చెబుతున్నారు.

తాను ఎవ‌రితో మాట్లాడ‌లేద‌ని.. ఎవ‌రూ త‌న‌తో మాట్లాడ‌లేద‌ని సిన్హా స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు త‌న‌కు 84 ఏళ్లు అని గుర్తు చేశారు. దాని వల్ల కొన్ని సమస్యలు ఉంటాయ‌న్నారు. ఈ నేప‌థ్యంలో తాను ఎన్ని రోజులు ప్ర‌జా జీవితంలో ఉంటానో చూడాల్సి ఉంద‌న్నారు.
Tags:    

Similar News