ఐఎస్ రాక్ష‌సులు ఆడోళ్ల‌ను కిడ్నాప్ చేశాక‌..!

Update: 2015-12-21 13:38 GMT
ఒక దారుణ వాస్త‌వాన్ని ప్ర‌పంచం ముందు పెట్టిందా బాధితురాలు. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న ఐఎస్ తీవ్ర‌వాదుల రాక్ష‌స‌కాండ ఎంత దారుణంగా ఉంటుంద‌న్న విష‌యాన్ని వివ‌రంగా చెప్పుకురావ‌టంతో.. ఆమె భ‌యాన‌క అనుభ‌వాన్ని విన్న వారంతా విస్మ‌యం చెందే ప‌రిస్థితి. ఇంత అనాగ‌రికంగా మ‌హిళ‌ల ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తారా అన్న షాక్ క‌ల‌గ‌క‌మాన‌దు. ఐఎస్ రాక్ష‌సుల చేతికి చిక్కి.. వారి చేతుల్లో న‌ర‌క‌యాత అనుభ‌వించి.. దేవుడా న‌న్ను ఎందుకు పుట్టించావ్ అన్న రోద‌న‌ల మ‌ధ్య బ‌తికిన ఆమె.. చివ‌ర‌కు వారి నుంచి బ‌య‌ట‌ప‌డింది. ఐక్య‌రాజ్య స‌మితి వేదిక‌గా తాను అనుభ‌వించిన ప్ర‌త్య‌క్ష న‌ర‌కాన్ని చెప్పుకొచ్చింది. ఇరాక్‌ కు చెందిన యాజిదీ తెగ‌కు చెందిన 21 ఏళ్ల నాదియా మురాద్ బాసీ త‌హాకు ఎదురైన ఆ దారుణ అనుభ‌వం గురించి చెప్పుకొస్తే..

ఇరాక్ లోని ఓ గ్రామంలో నివ‌సించే న‌న్ను.. గ‌త ఏడాది ఐఎస్ తీవ్ర‌వాదులు న‌న్ను ఎత్తుకెళ్లారు. నాతోపాటు మ‌రికొంద‌రు మ‌హిళ‌ల్ని.. పిల్ల‌ల్ని వారు కిడ్నాప్ చేశారు. వారికి అడ్డా అయిన మోసూల్ న‌గ‌రానికి తీసుకెళ్లారు. బ‌స్సులో మ‌మ్మ‌ల్ని తీసుకెళ్లే స‌మ‌యంలో వారు చాలా వెకిలిగా వ్య‌వ‌హ‌రించారు. మ‌మ్మ‌ల్ని తాకారు. అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. మొత్తం మేం 150 మందిమి ఉన్నాం. మోసూల్ న‌గ‌రానికి చేరుకున్నాక మ‌మ్మ‌ల్ని ఒక భ‌వ‌నంలో ఉంచారు. అక్క‌డ వేలాది యాజిదీ కుటుంబాలు ఉన్నాయి.

ఆడోళ్లంద‌రిని వ‌రుస‌గా నిలుచోపెట్టి.. ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన వారు.. వారికి న‌చ్చిన వారిని ఎంపిక చేసుకోవ‌చ్చు. ఏం జ‌రుగుతందో అర్థం కాని షాక్ లో బిర్ర‌బిగుసుకుపోయా. అచ్చం రాక్ష‌సుడ్ని త‌ల‌పించే ఓ భారీ ఆకారం నా ముందు నిలుచుంది. చాలా భ‌య‌మేసింది. విప‌రీతంగా ఏడుపు వ‌చ్చేసింది. చిన్న‌పిల్ల‌ను న‌న్ను వ‌దిలేయాల‌ని దీనంగా ఆర్థించా. ఆ రాక్ష‌సుడు న‌న్ను ఇష్ట‌మొచ్చిన‌ట్లు కొట్ట‌సాగాడు. త‌ర్వాత వెళ్లిపోయాడు. అత‌ను వెళ్లాక మ‌రో వ్య‌క్తి వ‌చ్చి నిలుచున్నాడు. అత‌ను కొంచెం చిన్న‌గా ఉన్నాడు.

ముందు  వ‌చ్చిన రాక్ష‌సుడు ఎక్క‌డ వ‌చ్చి తీసుకెళ‌తాడోన‌న్న భ‌యంతో న‌న్ను తీసుకెళ్లాల్సిందిగా అర్థించా. మ‌తం మార్చుకుంటావా?.. పెళ్లి చేసుకుంటాన‌ని అడిగాడు. మ‌తం మార్చుకోవ‌టం కుద‌ర‌ద‌ని చెప్పా. న‌న్ను ఒక గ‌దిలోకి తీసుకెళ్లి బ‌ట్ట‌లు విప్ప‌దీయ‌మ‌న్నాడు. సిగ్గుతో చితికిపోయా. నోట మాట రాలేదు. ఎందుకు బ‌తికి ఉన్నానో తెలీదు. అంత‌లో ఒంటి మీద మ‌ళ్లీ దెబ్బ‌లు. చాలా దారుణంగా కొట్టేశాడు. చివ‌ర‌కు అత‌ను త‌న కామం తీర్చుకున్నాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కొంత‌మంది తీవ్ర‌వాదులు వ‌చ్చి వారి కోరిక‌ను తీర్చుకున్నారు.

అలా వ‌రుస‌గా సాగిపోయింది. స్పృహ త‌ప్పి ప‌డిపోయా. అలా మూడు నెల‌ల పాటు న‌ర‌కం చూశా. ఆ త‌ర్వాత ఆ న‌ర‌కం నుంచి త‌ప్పించుకు వ‌చ్చా. నాలాంటి ఎంతోమంది ఆడోళ్లు అక్క‌డ ఉన్నారు. భ‌యంక‌ర‌మైన న‌ర‌కాన్ని చూస్తున్నారంటూ నాదియా వ‌ణుకుతున్న కంఠంతో త‌న విషాద గాథ‌ను చెప్పుకొచ్చింది.

ఆమె భ‌యాన‌క అనుభ‌వం సమావేశంలో పాల్గొన్న 15 దేశాల ప్ర‌తినిధుల్ని తీవ్రంగా క‌దిలించి వేశాయి. దారుణాల‌కు పాల్ప‌డుతున్న ఐఎస్ తీవ్ర‌వాదుల్ని క‌ఠినంగా శిక్షించాల‌ని.. వారిని వ‌దిలిపెట్ట‌కూడ‌దంటూ ప్ర‌తినిధులు త‌మ అభిప్రాయాల్ని వెల్ల‌డించారు. ఇంత దారుణ మార‌ణ‌కాండ ఇంకెంత కాలం సాగాలి?
Tags:    

Similar News