కొండపల్లిలో హై టెన్షన్ .. ఛైర్మన్ కుర్చీ కోసం వైసీపీ , టీడీపీ యుద్ధం !

Update: 2021-11-23 09:30 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ మున్సిపాలిటీల ఎన్నికలు పూర్తయ్యాయి. దాదాపు ఎన్ని చోట్ల ఛైర్మన్ల ఎన్నిక పూర్తైంది. అయితే, కృష్ణాజిల్లా, కొండపల్లి మున్సిపాలిటీ మాత్రం రాష్ట్రం దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఇక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి సమానంగా ఓట్లు రావడంతో ఛైర్మన్ ఎన్నిక పై ఉత్కంఠ నెలకొంది.

మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఈ అంశంపై సోమవారం కొండపల్లి మున్సిపల్ కార్యాలయం రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు ఛైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు.

అయితే , వరసగా రెండో రోజూ కొండపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఉదయం 9 గంటలకే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక కోసం టీడీపీ తరపున గెలిచిన కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడైన ఎంపీ కేశినేని శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. టీడీపీ ఎక్స్ అపీషియో సభ్యుని విషయంలో వైసీపీ అభ్యంతరం వక్తం చేస్తోంది.

కొండపల్లిలో 29 వార్డులుండగా 14 వైసీపీ, 14 టీడీపీ గెలిచాయి. ఇండిపెండెంట్ గా గెలిచిన కౌన్సిలర్ టీడీపీలో చేరడంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. ఐతే వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫీషియో ఓటు ఉండటంతో ఆ పార్టీ బలం కూడా15కు చేరింది. ఇక్కడే విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ మంత్రాంగం నడిపారు. కొండపల్లిలో ఎక్స్ అఫీషియో ఓటు కోసం హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకన్నారు.

దీంతో టీడీపీ బలం 16కు చేరింది. ఐతే దీనినే వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారని.. అక్కడ ఓటు హక్కు ఉన్న వ్యక్తికి కొండపల్లిలో ఎలా ఇస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. విజయవాడలో ఓటు హక్కున్న విషయాన్ని కోర్టులో దాటిపెట్టి కొండపల్లిలో ఓటు హక్కు తెచ్చుకున్నారని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆరోపిస్తున్నారు.

అప్రజాస్వామికంగా ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడపీ కుట్రలు చేస్తోందని ఆయన మండిపడుతున్నారు.మరోవైపు సోమవారం చోటు చేసుకున్న ఉద్రిక్తతల రీత్యా కొండపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. దాదాపు 400 మంది పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

మున్సిపల్ కార్యాలయాన్ని పోలీసులు పూర్తీగా తమ అధీనంలోకి తీసుకున్నారు. మున్సిపల్ ఆఫీస్ కు 100 మీటర్ల దూరంలో బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు.

కొండపల్లి మునిసిపల్ ఎన్నికల ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ సందర్భంగా జరిగిన పరిణామాలపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ. గొడవ సృష్టిస్తోన్న వైసీపీపై చర్యలు తీసుకుని, సజావుగా మునిసిపల్ ఎన్నికలు జరిపించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. హైకోర్టులో ఈ పిటిషన్ కు విచారణకు వచ్చే అవకాశం వుంది.


Tags:    

Similar News