ఆ ఎంపీ కుల వివాదంలో ఏం జ‌రిగింది..?

Update: 2016-07-22 07:03 GMT
అర‌కు ఎంపీ కొత్తప‌ల్లి గీత కులం విష‌యంలో తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్ట‌రు ఇచ్చిన స‌ర్టిఫికేట్ ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది. కొద్దిరోజుల క్రితం గీత త‌మ్ముడు వివేక్ కులం ఎస్టీ కాద‌ని తేల్చిన స్క్రూటినీ క‌మిటీయే ఇప్పుడు గీత ఎస్టీ అని నిర్ధారించింది. దాని ఆధారంగా క‌లెక్ట‌రు స‌ర్టిఫై చేశారు. దీంతో కొత్త‌ప‌ల్లి గీత‌ది ఒక కులం - ఆమె త‌మ్ముడిది వేరే కులం ఎలా అవుతుంద‌న్న ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. ఎంపీ త‌న కుల వివాదాన్ని ఇంత అడ్డ‌గోలుగాఎలా ప‌రిష్క‌రించుకోగ‌లిగార‌న్నది అంద‌రికీ మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

వైసీపీ నుంచి గెలిచిన గీత ఆ త‌రువాత ఆ పార్టీకి దూరమ‌య్యారు. టీడీపీతో క‌లిసి న‌డుస్తున్నారు. దీంతో టీడీపీ పెద్ద‌ల మ‌ద్ద‌తుతోనే ఆమె కుల వివాదం ఇంత అడ్డ‌గోలు మ‌లుపు తిరిగి ఆమెకు అనుకూలంగా వ‌చ్చింద‌ని అంటున్నారు. కొత్తపల్లి గీత - వివేక్‌. ఇద్దరూ ఒకే తల్లి బిడ్డలు.  వీరు ఎస్టీలు కాదంటూ 2004లో వివాదం చెలరేగింది. దీన్ని పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్ - గిరిజన  - సాంఘిక - బీసీ సంక్షేమ శాఖల అధికారులు - విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ ఎస్పీతో కూడిన స్క్రూటినీ కమిటీని నియమించి విచారణ జరిపించారు. కొద్ది రోజుల క్రితమే వివేక్‌ ను ఎస్టీ కాదని ఈకమిటీ తేల్చింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఒకే తల్లి కడుపున పుట్టిన వివేక్‌ ఎస్టీ కాదని తేలడంతో ఇక కొత్తపల్లి గీత కూడా ఎస్టీ కాదని నిర్ధారణ అయినట్టేన‌ని.. ఆమె ఎంపీ పదవికి ఎసరొచ్చినట్టేనని అందరూ భావించారు. కానీ ఆమె మాత్రం ఎస్టీ అంటూ ఇప్పుడు క‌లెక్ట‌రు స‌ర్టిఫై చేశారు.

గీత సోదరుడిని ఎస్టీ కాదని నిర్దారించిన అదే కమిటీ ఇప్పుడు కొత్తపల్లి గీత ఎస్టీ అంటూ తేల్చింది. కమిటీ తేల్చడమే ఆలస్యం - అదే కలెక్టర్‌ ప్రొసీడింగ్స్ కూడా జారీ చేశారు. ఓకే కడుపున పుట్టిన వారు ఒకరు ఒక కులానికి మరొకరు ఇంకోకులానికి ఎలా చెందుతారని విచారణ కమిటీని కలెక్టర్‌ కూడా ప్రశ్నించలేదు. విచారణ కమిటీ - కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాలు చూసి కంగుతినడం గిరిజన సంఘాల వంతైంది. 1993లోనే అప్పటి జేసీ మంగపతిరాజు... కొత్తపల్లి గీత - ఆమె తల్లిదండ్రులు - సోదరుడు ఎస్టీలు కాదని నిర్ధారించారు. ప్ర‌స్తుతం అధికారులు అరకు ఎంపీ కొత్తపల్లి గీతను ఎస్టీగా ధ్రువీక‌రించ‌డం వెనుక చంద్రబాబు ఒత్తిడి ఉందని చెబుతున్నారు.
Tags:    

Similar News