జీతాల చెల్లింపులో ఆలస్యంపై వైసీపీ ముఖ్య నేత సజ్జల హాట్‌ కామెంట్స్‌

Update: 2022-12-14 17:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ కు వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయని.. ఏపీ మంత్రివర్గం రూ.24 వేల కోట్ల పెట్టబడులకు ఆమోదం తెలిపిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దీంతో టీడీపీ చంద్రబాబుకు కడుపు మంట మొదలయిందని మండిపడ్డారు. ఏపీకి పెట్టుబడులు వస్తుంటే కొందరు ఓర్వ లేకపోతున్నారని సజ్జల నిప్పులు చెరిగారు.


రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని.. ఈ క్రమంలో నిబంధనల ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటోందని వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పెట్టుబడి వచ్చినా సీఎం జగన్‌కు బంధువులది టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీకి పెట్టుబడులు రాకూడదన్నదే ఎల్లో మీడియా తాపత్రయమని మండిపడ్డారు. ఎల్లో మీడియా బరితెగించి తప్పుడు రాతలు రాస్తోందని నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం పద్దతి లేకుండా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.

అడ్డగోలుగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటుగా మారిందని సజ్జల మండిపడ్డారు. ఏపీకి  ఆదాయం రాకూడదనేదే టీడీపీ, ఎల్లో మీడియా లక్ష్యమని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు కూడా జగన్‌ ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వరదలా ఒకేసారి వస్తున్నాయని సజ్జల తెలిపారు. 24 వేల కోట్ల పెట్టుబడులకు ఏపీ క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసిందని గుర్తు చేశారు. అయితే.. వీటిని చూసి చంద్రబాబుకు, ఆయన మీడియాకు కడుపు మంటగా ఉందని మండిపడ్డారు.

రివర్స్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులను పరిశ్రమల కింద పరిగణించారని వివరించారు. ఈ విషయంలో రహస్యం ఏమీ లేదని సజ్జల స్పష్టం చేశారు. అదానీలు, షిర్డీలు తమకేదో బంధువులైనట్లు, అవినీతి జరిగినట్లు చూపించే ప్రయత్నం టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రం బాగు పడాలని ఆలోచించే వ్యక్తి జగన్‌ అని.. కానీ చంద్రబాబుది మాత్రం బరితెగింపు వ్యవహార శైలి అని సజ్జల నిప్పులు చెరిగారు. చంద్రబాబు హయాంలో కడప స్టీల్‌ ప్లాంట్‌ను ఎందుకు కట్టలేక పోయారని సజ్జల ప్రశ్నించారు. తాము ఇచ్చిన మాట ప్రకారం ఒక పరిశ్రమను తీసుకొచ్చామని, అయితే దాన్ని కూడా వెటకారం చేస్తున్నారని ఆగ్రహించారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే.. జగన్‌ హయాంలో పరిశ్రమలు రాకూడదనేది ఆయన కోరికనేది అర్థమవుతోందన్నారు. జగన్‌ అర్జెంటుగా దిగిపోవాలి, చంద్రబాబు అధికారంలోకి వచ్చేయాలి అన్నట్టు ఎల్లో మీడియా వ్యవహరిస్తోందన్నారు.

గతంలో రెగ్యులర్‌ ఉద్యోగులకు జీతాలు సమయానికి వేసేవారు కాదని.. మిగిలిన కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు సైతం ఆలస్యంగానే వచ్చేవని సజ్జల గుర్తు చేశారు. తమ ప్రభుత్వం మాత్రం అందరికీ ఒకేసారి జీతాల చెల్లింపులు చేయాలన్న ప్రయత్నం చేస్తోందని వివరించారు. దాని వల్లే ఆలస్యం అవుతోందని చెప్పారు. మొత్తం జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో 70 శాతం వరకు 1, 2 తేదీల్లోనే జమ అవుతున్నాయని వెల్లడించారు. మిగిలిన 30 శాతం చెల్లింపులు మాత్రమే ఆలస్యమవుతున్నాయన్నారు. ఈ నెలలో ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని సజ్జల బాంబుపేల్చారు. ఇకపై ఆలస్యం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సంక్రాంతి నాటికి సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News