వారెవ్వా యవ్వారం : కోర్టు బిల్డింగ్స్ కే వైసీపీ రంగులా...?

Update: 2022-10-08 09:30 GMT
కలర్స్ పిచ్చి పీక్స్ కి చేరిందా లేక అంతా మా ఇష్టమని అనుకుంటున్నారా. ఈ డౌట్ అయితే కచ్చితంగా అందరికీ వస్తోంది. పార్టీ రంగులు జెండాలు అన్నీ కూడా ఆ పార్టీ రాజకీయాలు చేసుకునేవారి కోసం మాత్రమే. సాదర జనాలకు  అయితే అందరికీ అవసరమయే ప్రభుత్వ భవనాలు అందరినీ న్యాయం చేసే కోర్టు భవనాలకు కూడా పార్టీ రంగులు వేయాలన్న ఉత్సాహాన్ని చూసిన వారు ఏమనుకుంటారు. ఇది కచ్చితంగా యవ్వారం జోరు చేస్తోందనే అంటారు.

ఇపుడు అలాంటిదే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగింది. ఇప్పటికే హై కోర్టు ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయవద్దు అంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అలా జోరు చేసి చాలా వాటికి పార్టీ రంగులు పూసేసి ఏకంగా 1300 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రంగుల పాలు చేశారు.

దాని మీద ఎంతో రాజకీయ రచ్చ సాగింది. అయినా కోర్టు తీర్పు కానీ జనాల నుంచి వచ్చిన రియాక్షన్ కానీ ప్రతిపక్ష  పార్టీల పోరాటాలు కానీ ఏవీ తమకు పట్టదన్నట్లుగా వైసీపీ నేతలు మళ్లీ అదే పని చేస్తున్నారు అంటే ఏమనుకోవాలని అంతా అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో సీనియర్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను ప్రభుత్వ ప్రధాన కార్యాలయాన్ని కొత్త ఆవరణలోకి మార్చిన తర్వాత ఖాళీగా ఉన్న భవనానికి మార్చాలని నిర్ణయం తీసుకున్న అధికారులు కోర్టు సముదాయాన్ని ఇపుడు పూర్తిగా  వైసీపీ రంగులతో ముస్తాబు చేశారు.

టెక్కలిలో అలా పాత భవనాన్ని తొమ్మిది లక్షలతో పునరుద్ధరిస్తూ దాన్ని కోర్టుల కోసం కేటాయిస్తున్నారు.  ఇపుడు ఆ భవనాలను వైసీపీ రంగులేశారని రచ్చ సాగుతోంది. దీంతో దీని మీద విపక్షాలు గట్టిగా విమర్శలు చేయడంతో పాటు ఆందోళనకు దిగడంతో , ఆర్‌అండ్‌బి అధికారులు తమకు ఈ విషయం తెలియదని, అయితే సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెబుతున్నారు.

అయినా న్యాయాలయాలకు రంగులు వేయాలనుకోవడం ఏంటి అన్నదే ఇక్కడ ప్రశ్న. ప్రభుత్వ ఆఫీసులకే రంగులు వద్దని కోర్టుకు చెబితే ఆ కోర్టులు ఉండే భవనాలకు రంగులు వేయాలనుకోవడం కలర్స్ పిచ్చి పీక్స్ చేరిందన్న దానికి సంకేతమే అంటున్నారు. మరి ఈ విషయంలో ఆర్ అండ్ బీ అధికారులు సరిదిద్ది చర్యలు కనుక చేపట్టకపోతే మరోమారు హై కోర్టు వారు నుంచి గట్టి హెచ్చరికలను సర్కారీ పెద్దలే స్వీకరించాల్సి ఉంటుందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News