వైసీపీ నేత సూసైడ్.. సెల్ఫీ వీడియోతో సంచలన విషయాలు బయటకు

Update: 2022-04-08 14:30 GMT
రోటీన్ కు భిన్నమన్న మాట వైసీపీకి బాగా సూట్ అవుతుందనే చెప్పాలి. సాధారణంగా అధికారం చేతిలో లేని పార్టీకి చెందిన నేతలు హత్యకు గురి కావటం.. ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతుంది. కానీ.. ఏపీ అధికార పక్షమైన వైసీపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. చేతిలో అధికారం ఉండి కూడా స్థానిక నేత ఒకరు సూసైడ్ చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. రైలు కింద పడి చనిపోయిన ఆయన ఆత్మహత్య వెనుక పార్టీకి సంబంధించిన తీవ్రమైన ఆవేదన ఉందన్న విషయం తాజాగా సదరు నేతకు సంబంధించిన సెల్పీ వీడియో బయటకు రావటంతో వెల్లడైంది.

వైసీపీలో పదవుల అమ్మకం ఏ స్థాయిలో జరుగుతుందన్న విషయాన్ని చెప్పటమే కాదు.. పార్టీలో పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై ఆయన చెప్పిన మాటల్ని వింటే మతి పోవాల్సిందే. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గంగమ్మ ఆలయ మాజీ ఛైర్మన్ గా వ్యవహరించిన పార్థసారథి సూసైడ్ చేసుకున్న వైనం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్యకు కారణం పార్టీలోని పరిస్థితులే అన్న విషయం తాజా వీడియో స్పష్టం చేస్తోంది.

పార్టీ నేతల తీరుతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. కుప్పం మున్సిపాలిటీ కాక ముందు వార్డు సభ్యుడిగా రెండుసార్లు పని చేసిన ఆయన.. వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారని చెబుతారు.

కుప్పంలోని తిరుపతి గంగమ్మఆలయ ఛైర్మన్ గా పని చేస్తున్న వేళ.. ఆయన్ను పదవి నుంచి అవమానకరంగా దించేయటం.. తాను ఎంత వేడుకున్నా పట్టించుకోని నేతల తీరును చెప్పిన వైనం చూస్తే ఆవేదన కలుగక మానదు.

గంగమ్మ ఆలయ ఛైర్మన్ గా రెండుళ్లుగా కొనసాగుతున్నప్పటికీ కరోనా కారణంగా జాతర చేయలేదని.. మరో నెలలో జాతరను చేపట్టి పదవి నుంచి దిగిపోతానని వైసీపీ నేతలకు చెప్పినా.. వారు అవకాశం ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన సంచలన అంశాల్ని వెల్లడించారు. "గంగమ్మ గుడి ఛైర్మన్ పదవి కోసం రూ.35 లక్షలు ఖర్చు చేశా. పదవి ఇచ్చినందుకు రూ.15 లక్షలు.. బోర్డు ఏర్పాటుకు రూ.10 లక్షలు.. ఆలయ మరమ్మతుల కోసం మరోరూ.10 లక్షలు ఖర్చు చేశా. దీని కోసం అప్పులు చేశా. ఇప్పటికి వడ్డీ కడుతున్నా. ఏడేళ్లుగా పార్టీని నమ్ముకొన్నా. నా దగ్గర కూడా డబ్బులు తీసుకునే పదవులు ఇచ్చారు. కొత్తగా పార్టీలోకి వస్తున్న వారి నుంచి డబ్బులు తీసుకొని పదవులు అమ్ముకుంటున్నారు" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీలో ఈ స్థాయిలో పదవుల అమ్మకాలు జరుగుతున్న వైనంపై అధినేత జగన్ ఇప్పటికే ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News