బాబుని టచ్ చేస్తే.. .అసలు సినిమా అపుడేనా...?

Update: 2022-05-11 07:29 GMT
రాజకీయాల్లో దూకుడు ఉండాలి. కానీ దూకుడే రాజకీయం కాకూడదు. ఇక చూస్తే ఎన్ని మారినా ఎంతటి గండరగండలు పవర్ లోకి వచ్చినా కొన్నిఏ దేశానా ఎపుడూ  మారవు అంతే.  ఈ ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత దేశంలో కొన్ని కొందరి కోసమే అన్నట్లుగానే  ఉన్నాయి, ఎప్పటికీ  ఉంటాయి. బడా బాబుల జోలికి వెళ్ళేంత సీన్ ఎపుడూ పెద్దగా  జరిగినది లేదు.

దానికి రాజకీయ కారణాలు ఎక్కువ. పలుకుబడి కలిగిన వారి మీద యాక్షన్ తీసుకుంటే అది రివర్స్ అవుతుంది. దానికి పక్కా ఉదాహరణ వైఎస్ జగన్. ఆయన్ని అరెస్ట్ చేసి నాడు కాంగ్రెస్ పార్టీ జైలులో పెట్టించింది. దూకుడుగా ముందుకు వెళ్ళింది. ఫలితం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు దైన్యమంతా కాంగ్రెస్ దే అయింది.

అంటే మొండిగా వెళ్తే రిజల్ట్ ఎలా ఉంటుందో వైసీపీ పెద్దలకు బాగా తెలుసు. కానీ ఇపుడు అయితే ఒక ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. అమరావతి రాజధానిలో భూ సేకరణకు సంబంధించి అవకతవకలు జరిగాయి అన్న దాని మీద ప్రభుత్వం కేసు నమోదు చేసింది.

ఈ కేసులో ఏ వన్ గా నాటి సీఎం చంద్రబాబు ఉన్నారు. ఏ టూ గా నారాయణ ఉన్నారు. అయితే నారాయణను పరీక్షల లీకేజ్ విషయంలో మొదట అరెస్ట్ చేశారు. సీయార్డీయే కేసు విషయంలో ఆయన అరెస్ట్ అవుతారు అని అంటున్నా ఆయన కంటే ముందు బిగ్ షాట్ గా ఉన్న చంద్రబాబునే అరెస్ట్ చేయాలన్నది వైసీపీ పెద్దల పంతం అని అంటున్నారు.

నిజానికి తనను అప్పట్లో అకారణంగా అరెస్ట్ చేయించారు అన్న బాధ అయితే జగన్ లో ఉందని అంటారు. దాంతో జగన్ అధికారంలోకి వచ్చాక  చంద్రబాబు మీద భారీ యాక్షన్ ఉంటుందని అనుకున్నారు. వరసబెట్టి టీడీపీ బడా నాయకుల అరెస్ట్ వేళ కూడా చంద్రబాబు మాట వినిపించేది. అయితే మూడేళ్ళు గడచినా బాబుని చిన బాబుని కూడా వైసీపీ ఏ కోశానా  టచ్ చేయలేదు. దాంతో ఇక రానున్న రెండేళ్ళలో ఇలాంటి సంచలనాలు అయితే ఉండవని అంతా అనుకున్నారు.

కానీ చూస్తే ఇపుడు సీన్ మళ్ళీ మారుతోంది. ఏపీ హీటెక్కేలా పొలిటికల్ సీన్ కనిపిస్తోంది. అదెలా అంటే చంద్రబాబుని సీఆర్డీయే కేసులో అరెస్ట్ చేయాలని వైసీపీ సర్కార్ ఉబలాటపడుతోంది అంటున్నారు. అది ఏ క్షణమైనా జరగవచ్చునని కూడా అంటున్నారు. అయితే ఇది నిజంగా జరుగుతుందా అన్న చర్చ కూడా మరో వైపు వస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో బాబు అరెస్ట్ అయితే దాని పొలిటికల్  ఇంపాక్ట్ వేరేగా ఉండేది. ఇపుడు మూడేళ్ళు గడచిపోయాయి. పైగా వైసీపీ పాలన మీద జనాల్లో వ్యతిరేకత ఉంది. ఇక జిల్లాల టూర్లు చేస్తున్న చంద్రబాబుకు మంచి స్పందన లభిస్తోంది. ఒక విధంగా టీడీపీ బాగా పుంజుకుంటోంది. ఈ కీలక సమయంలో బాబుని కనుక అరెస్ట్ చేస్తే టీడీపీ నెత్తిన పాలు పోసినట్లే.

ఏ అరెస్ట్ అయినా రాజకీయ నాయకులను మరో రెండు మెట్లు పైకి ఎక్కించేదిగానే ఉంటుంది. ఇక అన్ని రకాలైన రాజకీయాలలో ఆరితేరిన చంద్రబాబు లాంటి వారు ఇలాంటి అరెస్ట్ లను ఎలా తమకు అనుకూలంగా మలచుకుంటారో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల బాబు అరెస్ట్ మీద వైసీపీ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందనే అంటున్నారు.

అలా కాదు బాబుని అరెస్ట్ చేశామని ఒక్కసారి అయినా అనిపించుకోవాలి, తమ పంతం నెగ్గించుకోవాలి అన్నది కనుక ఉంటే కచ్చితంగా బాబు అరెస్ట్ అవుతారు. కానీ ఆ తరువాత సంభవించే రాజకీయ పరిణామాలు వైసీపీకి పూర్తి యాంటీగా మాత్రం ఉంటాయని అంతా అంటారు. ఇక సామాన్య జనాలకు అవినీతి అక్రమాల  సంగతి కంటే వయసులో పెద్దాయన, మాజీ సీఎం చంద్రబాబుని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అన్నదే బాగా పోతుంది. దాంతో టీడీపీకి అది పూర్తిగా ప్లస్ అవుతుంది.

అందువల్ల వైసీపీ ఇక దేన్ని అయినా ఎదుర్కొంటాం, దేనికైనా సిద్ధమని భావిస్తే మాత్రమే అరెస్ట్ చేసుకోవాలి. మరి అలా జరుగుతుందా. ఏమో ఎవరూ చెప్పలేరు. ఇక ఒక వైపు కోర్టులకు వేసవి సెలవులు కాబట్టి బాబు అరెస్ట్ కి ఇదే సరైన సమయం అని కూడా వైసీపీ వారు భావిస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి.
Tags:    

Similar News