జ‌గ‌న్‌ తోనే తేల్చ‌కుంటాను.. అంటున్న 'వైసీపీ ఎమ్మెల్యే'!?

Update: 2022-06-07 07:36 GMT
వైసీపీలో నేత‌ల ఆధిప‌త్య ధోర‌ణి నానాటికీ ముదురుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన అన్నా రాంబాబు వ్య‌వహారం రోజు రోజుకు ముదురుతోంది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన ఆయ‌న‌.. ఎమ్మెల్యే టికెట్ సొంతం చేసుకుని.. విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఇత‌ర ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా.. అన్నా.. సీఎం జ‌గ‌న్ పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో తెచ్చుకున్న మెజారిటీకి కొంచెం అటు ఇటుగా మెజారిటీ తెచ్చుకున్నారు.

దీంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌జ‌లంతా తన‌వెంటే ఉన్నార‌ని.. త‌న‌కు తిరుగులేద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌త నెల‌లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో త‌న‌కు మంత్రి పీఠం ద‌క్క‌లేద‌ని.. తీవ్ర‌స్థాయిలో యాగీ చేశారు. ఎవ‌రికో మంత్రి ప‌ద‌వులు ఇచ్చార‌ని.. త‌మ వ‌ర్గానికి ఇవ్వ‌లేద‌ని.. పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆయ‌న వ్య‌వ‌హార శైలి పూర్తిగా మారిపోయింది. పార్టీ, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు క‌డు దూరంగా ఉంటున్నారు.

నిజానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అంద‌రూ కూడా.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో పాల్గొనాలని .. సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. దీనిలో ఎవ‌రికీ ఆయ‌న మినహాయింపు ఇవ్వ‌లేదు. మాజీలు స‌హా సీనియ‌ర్లు అందరూ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు.

అయితే.. గిద్ద‌లూరులో మాత్రం ఈ కార్య‌క్ర‌మాన్ని ఎమ్మెల్యే అన్నా బాయ్ కాట్ చేశారు. క‌నీసం.. త‌ను ప‌ట్టించుకోవ‌డం కూడా లేదు. పోనీ.. ఆయ‌నే మ‌న్నా బిజీగా ఉన్నారా.. అంటే..అది కూడా లేదు. నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంటూ.. వివిధ కార్యక్ర‌మాల్లో పాల్గొంటున్నారు.

కానీ, వైసీపీ నిర్వ‌హిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మాత్రం ఆయ‌న దూరంగా ఉంటున్నా రు. అంతేకాదు.. పార్టీలో సీనియ‌ర్లు, సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహిత నాయ‌కులుగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి స్వ‌యంగా.. తాను గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మానికి వ‌స్తాన‌ని చెప్పినా .. అన్నా మాత్రం కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాలేదు. అంతేకాదు, గ‌త నెల 30న జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసి.. మూడేళ్ల‌యిన సంద‌ర్భంగా గిద్ద‌లూరులో పెద్ద కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మానికి కూడా అన్నా డుమ్మా కొట్టారు. అదేరోజు సాయంత్రం జ‌రిగిన ఓ ఆల‌య కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను చూస్తే.. పార్టీలో జ‌గ‌న్ త‌ర్వాత‌.. త‌న‌కే ప్ర‌జ‌లు మెజారిటీ ఇచ్చార‌ని.. అలాంటి త‌న‌కు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింద‌ని అన్నా చెబుతున్నారు!. ఈ నేప‌థ్యంలో త‌న‌కు పార్టీలో గుర్తింపు.. లేదా ప్ర‌భుత్వంలో ప్రాధాన్యం విష‌యాల్లో ఆయ‌న నేరుగా సీఎం జ‌గ‌న్‌వ‌ద్దే తేల్చుకునేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. మ‌రి జ‌గ‌న్ చివ‌ర‌కు అన్నాకు ఏం చెబుతారో.. ఎలా బుజ్జ‌గిస్తారో చూడాలి.
Tags:    

Similar News