తన తండ్రి ఘాటు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే హాట్‌ కామెంట్స్‌!

Update: 2022-11-23 06:28 GMT
కొద్దిరోజుల క్రితం జగ్గయ్యపేటలో కార్తీక వనసమారాధన సందర్భంగా మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఆయన కుమారుడు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని.. వాటిని ఖండిస్తున్నట్టు తెలిపారు.

రాజధాని అమరావతి, ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి పేరు మార్చడం, కమ్మ సామాజికవర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలపై వసంత నాగేశ్వరరావు ఇటీవల జగన్‌ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీతో పోలిస్తే తెలంగాణలోనే కమ్మలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతోందని వసంత నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టిన సంగతి విదితమే.

వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి. దీంతో ఆయన కుమారుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ మీడియాతో ముందుకొచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వసంత కృష్ణప్రసాద్‌ తన తండ్రి వ్యాఖ్యలను ఖండించారు.

తిరిగే కాలు, మాట్లాడే నోరు ఊరుకోవన్నట్టు తన తండ్రి వ్యవహరిస్తుంటారని చెప్పుకొచ్చారు. అందువల్ల తన తండ్రిని ఆపలేనని తెలిపారు. ఆయన వెళ్లాలనుకున్న చోటుకు వెళ్తుంటారని.. మాట్లాడాలనుకున్నది మాట్లాడుతుంటారని వివరించారు. అందువల్ల ఆయన వ్యాఖ్యలను వైసీపీ కార్యకర్తలు, నేతలెవరూ పట్టించుకోవద్దని విన్నవించారు.

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పును తన తండ్రి తప్పుబట్టడాన్ని తను సమర్థించనని వసంత కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. రాజధాని విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయమే తనకు శిరోధార్యం అని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి జగన్‌తోనే తన ప్రయాణం కొనసాగుతుందని వసంత కృష్ణప్రసాద్‌ స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఉద్దేశపూర్వకంగా పార్టీలో గందరగోళ వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పోటీ చేయమంటే చేస్తా, లేకుంటే పార్టీ కోసం పనిచేస్తానని వసంత కృష్ణప్రసాద్‌ తెలిపారు. మంత్రి జోగి రమేష్, తనకు ఉన్న విభేదాల విషయంలో అధిష్టానంతో చర్చించిన తర్వాతే మీడియాతో మాట్లాడుతానన్నారు.

తాను అనారోగ్యంతోనే ఇటీవల కాలంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదన్నారు. మైలవరంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తనను మారిస్తే ఆ అభ్యర్థికి మద్దతుగా తాను నియోజకవర్గంలో పనిచేస్తానని వెల్లడించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News