మరో ఎమ్మెల్యే ఫిర్యాదు.. రఘురామ అరెస్ట్ తప్పదా?

Update: 2020-07-09 11:10 GMT
వైసీపీ అధిష్టానానికి ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ కొట్టాలో బాగా తెలుసున్నట్టుంది.. వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్న నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఉచ్చు బిగుస్తున్నట్టు వాతావరణం కనిపిస్తోంది.

తనపై వ్యక్తిగత, కించపరిచేలా దూషణలు విమర్శలు చేశాడని ఆరోపిస్తూ నిన్న ఏకంగా వైసీపీ మంత్రి రంగనాథరాజు తరుఫున ఆయన పీఏ ఎంపీ రఘురామపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఇవాళ మరో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా దాదాపు ఇదే కారణాలతో ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. గతంలో ఆయన విమర్శించిన నర్సాపురం ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలతోనే వైసీపీ కేసులు పెట్టించడం చూస్తుంటే రఘురామ అరెస్ట్ తప్పదనే చర్చ మొదలైంది.

ఇప్పటికే రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ పార్టీ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అది పరిశీలనలో ఉండగానే ఇప్పుడు కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పరిస్థితి చూస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలతో ఫిర్యాదులు చేయించి ఆయనకు ఉచ్చు బిగుస్తున్నట్టే కనిపిస్తోంది. గతంలో రఘురామ తన పార్టీకే చెందిన తన ఎంపీ పార్లమెంట్ పరిధిలోని అందరిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అవే వైసీపీకి అస్త్రంగా మారాయి. వైసీపీ అధిష్టానం ఆదేశాలతోనే వీరు రంగంలోకి దిగారా అన్నది రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫిర్యాదుల్లో వైసీపీ నేతలు పేర్కొంటున్న కారణాలు కూడా ఈ వాదనను బలిపరిచేలానే ఉన్నాయంటున్నారు.
Tags:    

Similar News