టీడీపీ, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేల‌ను క‌లిసి వైసీపీ ఎమ్మెల్యే.. ఏం జ‌రుగుతోందక్క‌డ‌?

Update: 2022-07-18 06:30 GMT
రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌ల మ‌ధ్య‌ సుహృద్భావ సంబంధాలు ఉండేవి. రాజ‌కీయాన్ని రాజ‌కీయంగా అంత‌వ‌ర‌కే చూసేవారు. ప్ర‌త్య‌ర్ధి పార్టీల ఇళ్ల‌కు కూడా ఆయా పార్టీల నేత‌లు వెళ్లి ముచ్చ‌టించేవారు. ఒక‌రి ఇంట శుభ‌కార్యాల‌కు మ‌రొక‌రు హాజ‌ర‌య్యేవారు.

ఒక‌రిపై ఒక‌రి విమ‌ర్శ‌లు కూడా రాజ‌కీయంగానే ఉండేవి. ఎక్క‌డా హ‌ద్దు దాటేవి కాదు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. రాజ‌కీయ పార్టీల నేత‌ల ఆగ‌ర్భ శ‌త్రువుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌ర్యాద‌కు కూడా ప‌ల‌క‌రింపులు క‌రువ‌య్యాయి. ఇప్పుడు రాజ‌కీయాల‌ను చూస్తున్న పెద్ద‌లు నాటి రాజ‌కీయాల‌ను తల‌చుకుని బాధ‌ప‌డుతున్నారంటే అతిశయోక్తి కాదు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని శ్రీ స‌త్య‌సాయి జిల్లా మ‌డ‌క‌శిర‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున డాక్ట‌ర్ ఎం.తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్సీపీ నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ఎమ్మెల్యే తిప్పేస్వామి ప్ర‌తిప‌క్ష పార్టీల మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల‌కు వెళ్ల‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఘ‌ట‌న చ‌ర్చనీయాంశంగా మారింది.

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి త‌న ప్ర‌త్య‌ర్థి పార్టీలు అయిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గుండుమ‌ల తిప్పేస్వామి ఇంటికి వెళ్లారు. ఆ త‌ర్వాత‌ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఇంటికి వెళ్లారు. ఇందులో భాగంగా టీడీపీ, కాంగ్రెస్ నేతలను కలిసి జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. ప‌నిలో ప‌నిగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే ఓట్లు వేయాల‌ని అభ్య‌ర్థించారు.

త‌మ ఇంటికి వ‌చ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యేను టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు కూడా మ‌ర్యాద‌పూర్వ‌కంగా స్వాగ‌తించారు. ఆయ‌న‌తో కాసేపు స‌ర‌దాగా ముచ్చ‌ట్లు పెట్టుకున్నారు. దీంతో ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్ర‌త్య‌ర్థి పార్టీల మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఇంటికి ఎందుకు వెళ్లారంటూ ఆస‌క్తిక‌రంగా ప్ర‌జ‌లు చ‌ర్చించుకున్నారు.

మ‌డ‌క‌శిర నియోజ‌క‌ర్గంలో ఈ క‌ల‌యిక హాట్ టాపిక్ గా మారింది. అయితే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా అధికార పార్టీ ఎమ్మెల్యే తిప్పేస్వామి ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌ను క‌లిశార‌ని తెలియ‌డంతో అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు ఊపిరిపీల్చుకున్నార‌ని అంటున్నారు.
Tags:    

Similar News