రోజాను అడ్డుకున్నది టీడీపీ వారేనా - చంద్రబాబు డైరెక్షన్‌ లోనా?

Update: 2020-02-20 13:59 GMT
మూడు రాజధానుల అంశంపై రైతులు - విపక్ష నేతల నుండి అధికార పార్టీ నేతలకు నిరసన సెగలు తగులుతున్నాయి. తాజాగా, గురువారం ఏపీఐఐసీ చైర్మన్ రోజాను రైతులు అడ్డుకున్నారు. ఐనవోలు ఎస్ ఆర్ ఎం వర్సిటీలోని ఓ సదస్సుకు హాజరైన ఆమెకు వ్యతిరేకంగా మహిళా రైతులు నినాదాలు చేశారు. సదస్సు ముగిసిన తర్వాత నీరుకొండ - పెదపరిమి ప్రాంతంలో కూడా ఆమెను అడ్డుకున్నారు. పెదపరిమిలో ఆమె వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వందలాది మంది పోలీసులు రక్షణ కల్పించారు. ఆ తర్వాత కూడా గుంటూరుకు వెళ్లే దారిలో పలుమార్లు అడ్డుకున్నారు.

తమకు న్యాయం చేయండి, మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు - భూములు ఇచ్చిన రైతులు పెయిడ్ ఆర్టిస్ట్‌ లు కాదు.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎస్ ఆర్ ఎం వర్సిటీ సదస్సుకు రావడానికి ముందే రైతుల నిరసన గురించి ఆమెకు సమాచారం ఉంది. దీంతో ఆమె వెనుక గేట్ ద్వారా లోనికి వెళ్లారు. అక్కడ కూడా నిరసనకారులు నినాదాలు చేశారు. ఆమె కారు దిగగానే మహిళా నిరసనకారులు చుట్టుముట్టారు. పోలీసులు రంగంలోకి దిగి ఆమెను పంపించవలసి వచ్చింది.

అడుగడుగునా నిరసన వ్యక్తం కావడంతో రోజా ఆగ్రహించారు. తనను అడ్డుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కారణమని ఆరోపించారు. ఇదంతా ముందస్తు వ్యూహంలో భాగంగా జరిగిందని - చంద్రబాబు తప్ప మరొకరు చేసేందుకు అవకాశం లేదని మండిపడ్డారు. మరోసారి ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదన్నారు. తనను అడ్డుకుంటే చంద్రబాబును రాష్ట్రంలో అడుగు కూడా కదలనివ్వనని హెచ్చరించారు.

నిరసనకారులు తనను అడ్డుకోవడంతో ఓ సమయంలో రోజా కారులో నుండి వీడియో తీశారు. ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా రోజాను అడ్డుకోవడానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారని - అధికారులను కూడా వదిలి పెట్టడం లేదని పేర్కొన్నారు. రైతుల ముసుగులో టీడీపీ గూండాలు వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని - దీంతో చంద్రబాబు ఎంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోందని వైసీపీ తన ఫేస్‌ బుక్ పేజీలో పేర్కొంది.

అయితే మొన్న పిన్నెళ్లి - నిన్న సురేష్‌పై, నేడు రోజా కారును అడ్డుకున్న వారు లేదా దాడి చేసిన వారు రైతులని విపక్షాలు చెబుతుంటే - రైతుల ముసుగులో టీడీపీ గూండాలు దాడి చేస్తున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. అయితే దాడి చేసింది లేదా అడ్డుకుంది టీడీపీవారా లేక నిజంగానే రైతులా అనేది తెలియాల్సి ఉందనేది కొందరి మాట.
Tags:    

Similar News