కలెక్టర్ ఎదుటే శిలాఫలకాన్ని విరగ్గొట్టామంటూ చెలరేగిన వైసీపీ ఎమ్మెల్యే

Update: 2022-04-07 06:38 GMT
తెగింపును తప్పు పట్టలేం. కానీ.. బరితెగింపును ఎవరూ భరించలేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. అధికారపక్షంలోని వారు తమకు తోచినట్లుగా వ్యవహరించటం.. విపక్షాల్ని నిలువరించేందుకు వీలుగా దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తున్న వైనం విమర్శలకు తావిస్తోంది.

అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తాము అనుకున్నది అనుకున్నట్లు చేయటానికి ఎలాంటి మొహమాటమే కాదు.. మర్యాదలకు సైతం తిలోదకాలు ఇవ్వటం ఇప్పుడు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఉదంతం శ్రీకాకుళంలో చోటు చేసుకుంది.

టెక్కలిలో జిల్లా ఆసుపత్రి భవన సముదాయాన్ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేదిక మీద ఉప ముఖ్యమంత్రితో పాటు.. జిల్లా కలెక్టర్.. ఎస్పీలతో పాటు.. స్థానిక పోలీసులు ఉన్నారు. ఇలాంటివేళ మైకు పట్టుకున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెలరేగిపోయారు.

"మిస్టర్ ఎక్స్ కార్మిక శాఖా మంత్రి.. నేను చెబుతున్నా. ఈ శిలాఫలకాల్ని మేం విరగ్గొట్టాం. ఏం చేస్తావో చేసుకో' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.జిల్లా కలెక్టర్.. ఎస్పీల సమక్షంలో ఎమ్మెల్సీ ఇలా మాట్లాడటం విస్మయానికి గురి చేసింది. దువ్వాడ దూకుడ్ని అర్థం చేసుకున్న ధర్మాన క్రిష్ణదాస్ ఆయన వద్దకు వచ్చి.. అలా మాట్లాడటం సరికాదంటూ సర్ది చెప్పి అర్థం లేని ఆయన ఆవేశానికి బ్రేకులు వేశారు. ధర్మాన వార్నింగ్ తో తెలివిలోకి వచ్చిన దువ్వాడ.. సర్దుకొన్నారు. తన ఆవేశపూరిత వ్యాఖ్యల్ని ఆపేశారు.

ఈ కార్యక్రమం అనంతరం తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఆయన.. కలెక్టర్ సమక్షంలో తానీ వ్యాఖ్యలు చేయటం బాధాకరమని.. అధికారిక కార్యక్రమంలో ఇలా మాట్లాడకూడదని..క్షమించాలని కోరారు. ఏమైనా.. ఈ తరహా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్ని మరింత దిగజారేలా చేస్తాయని చెప్పక తప్పదు.

వ్యవస్థల్ని రక్షించాల్సిన స్థానాల్లో ఉన్న వారు.. అందుకు భిన్నంగా తమకు తోచినట్లు చేస్తామని.. తమ చేతిలో అధికారం ఉందంటూ ఎగిరెగిరి పడే పరిస్థితి.. రానున్న రోజుల్లో మరిన్ని దరిద్రగొట్టు పరిస్థితులకు కారణమవుతుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా దువ్వాడ వారి బరితెగింపు జిల్లా వ్యాఫ్తంగా సంచలనంగా మారింది.
Tags:    

Similar News