పవనే శరణ్యమంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు... ?

Update: 2021-10-08 11:30 GMT
మంత్రి పదవి పట్టడం అన్నదే రాజకీయ నాయకులకు అసలైన క్వాలిఫికేషన్. అదే వారికి పరమ పధ‌ సోపానం కూడా. రాజకీయాల్లో అందరూ ముఖ్యమంత్రులు ప్రధానులు కాలేరు. కాబట్టి ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా తమ జీవితాశయంగా మంత్రి పదవినే పెట్టుకుంటారు. ఇవన్నీ ఎందుకంటే ఇపుడు ఏపీలో మంత్రి వర్గ విస్తరణ మీద హాట్ హాట్ చర్చ సాగుతోంది. జగన్ చెప్పిన మాట మేరకు పదవుల వడ్డన త్వరలోనే ఉంటుందని ఆశావహులు చాలా ఆకలిగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో 151 మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ తరఫున గెలవడం అన్నది రికార్డు. అది ఒక ఘనమైన చరిత్ర. అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీకి అంతమంది ఎమ్మెల్యేలు ఉండడం వరమూ భారం కూడా. అందరూ అందరే అన్నట్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతా మంత్రి కుర్చీ కోసమే గురి పెట్టి మరీ చూస్తున్నారు. దాంతో మంత్రి వర్గ విస్తరణ అంటే తేనే తుట్టెను కదిపినట్లే.

ఇవన్నీ ఇలా ఉంటే ఈ మధ్యన ఎవరి శక్తి మేరకు వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ జగన్ కంట్లో పడాలని తెగ తాపత్రయపడుతున్నారు. గట్టిగా మాట్లాడితేనే జనంలో గుర్తింపు అలాగే హై కమాండ్ వద్ద కూడా మార్కులు పడతాయని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే వారు నిన్నటిదాక టీడీపీని విమర్శిస్తూ వచ్చారు. అయితే అది బొత్త్తిగా రొటీన్ వ్యవహారం అయిపోయింది, పెదబాబుని, చినబాబుని విమర్శిస్తే ఎక్కడా హైలెట్ కావడంలేదు. దాంతో రూట్ మార్చి జనసేనాని పవన్ కళ్యాణ్ మీద పడుతున్నారని అంటున్నారు. పవన్ ని అంటే రివర్స్ అటాక్ కూడా గట్టిగానే ఉంటుంది. జనసైనికులు అసలు ఊరుకోరు, పైగా సోషల్ మీడియాలో ఒక్క లెక్కన మోతెక్కిపోతుంది.

దాంతో ఇపుడు పవనే శరణ్యం అన్నట్లుగా ఆశావహులంతా ఆయన మీద పడ్డారు అంటున్నారు. తాజాగా పవన్ని ఓడించి గెలిచిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పవన్ మీద దారుణంగానే మాట్లాడారు, ఇంతవరకూ పవన్ని విమర్శించిన వారు సైతం విస్తుబోయేలా గ్రంధి పవన్ మీద హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అఫీషియల్ గా పవన్ కి ముగ్గురు పెళ్ళాలు, మనకు తెలియకుండా ఇంకా ఎందరో అంటూ గ్రంధి శ్రీనివాస్ పేల్చిన సెటైర్లు ఇపుడు ఊహించినట్లుగానే మంట పుట్టించాయి. దానికి ఎక్కడికక్కడ జన సైనికులు గట్టిగానే గ్రంధిని తగులుకున్నారు. మా పవన్ని అంటేనే తప్ప మీకు పొద్దు పొడవదా అంటూ గట్టిగానే సౌండ్ చేస్తున్నారు.

జగన్ అన్ని పధకాలు ఒక ఎత్తు అయితే పవన్ని తిట్టు పధకం అన్నది ఇపుడు బాగా అమలు అవుతోందని కూడా జనసైనికులు వెటకారం ఆడారు. పవన్ని తిడితేనే మంత్రి పదవి వస్తుంది అన్న కాన్సెప్టుతో ముందుకు పోతున్న వైసీపీ ఎమ్మెల్యేలకు వారు ఆల్ ది బెస్ట్ అని కూడా చెబుతున్నారు. అయితే మాట్లాడేటపుడు ముందూ వెనకా చూసుకోకపోతే మాత్రం అందరి జాతకాలు తమ వద్ద ఉన్నాయి బయటపెడతామని కూడా హెచ్చరించడం విశేషం. మొత్తానికి జనసైనికులు ఇన్నాళ్ళూ ఆవేశపడిపోయి వైసీపీ నేతల మీద తిట్ల పురాణాన్ని లంకించుకునేవారు. ఇపుడు వారికి కూడా రాజకీయం బాగా అర్ధమవుతున్నట్లుగా ఉంది. అందుకే మంత్రి పదవుల కోసం మమ్మల్ని వాడుకుంటారా అంటూ గుడ్లురుముతున్నారు. ఏది ఏమైనా పవన్ కి జగన్ కి పడదు అన్నది నిజం. మరి పవనే దగ్గరుండి మరీ వైసీపీ ఎమ్మెల్యేలను మంత్రులను చేయడానికి ఉపయోగపడుతున్నారంటే ఆశ్చర్యకరమే. కానీ రాజకీయాల్లో ఇలాంటివి షరా మామూలే అనుకోవాలంతే.





Tags:    

Similar News