విశాఖ ఉక్కు : ప్రభుత్వంతో మాట్లాడి చెప్తాం అన్న మంత్రి బొత్సా .. రాజీనామాకి సిద్ధమంటున్న వైసీపీ ఎంపీ

Update: 2021-02-06 11:10 GMT
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరించేందుకు ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ప్రతిపక్షాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక యూనియన్లు, ప్రజలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నిరసనలు తెలుపుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఇంకా నోరుమెదపడం లేదు. అయితే అలోచించి చెప్తామని బొత్సా చెప్తుంటే , రాజీనామాకైనా సిద్దమే అని వైసీపీ ఎంపీ అన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రజల మనోభావాలతో కూడుకున్నదని ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని అనలేదు. అయితే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని కానీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పలేదు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో ఏ స్టాండ్ తీసుకోవాలో అన్న సందేహంలోనే ప్రభుత్వం ఉంది. విశాఖ ఉక్కు పరిశ్రమ కు కొంత నష్టాలు వచ్చాయని సుమారు 25 వేల నుండి 30 వేల కోట్ల వరకు నష్టం ఉందని దాన్ని అధిగమించడం కోసం కేంద్ర ప్రభుత్వం వారికున్న పారిశ్రామిక విధానాన్ని తీసుకున్నదని పేర్కొన్నారు బొత్సా సత్యనారాయణ. ఏదేమైనా ప్రజల సెంటిమెంట్ తో కూడుకున్న అంశం కాబట్టి దీనిపై ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మాట్లాడతానని అన్నారు.

తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సంఘీభావం ప్రకటించిన ఆయన, విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవడం కోసం తాము దేనికైనా సిద్ధం అంటూ ప్రకటించారు. అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడబోమని ,కేంద్రం తన నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని లేదంటే స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద నిరాహార దీక్షకు దిగుతానని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ లో దీని గురించి మాట్లాడతాను అని అన్నారు.


Tags:    

Similar News