పార్టీ నుంచి బహిష్కరించాలని సవాల్

Update: 2022-06-24 08:30 GMT
దమ్ముంటే తనను పార్టీ నుంచి బహిష్కరించాలని  వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు సవాల్ విసిరారు. ఎంపీపై అనర్హత వేటు వేయాలని పార్టీ శతవిధాల ప్రయత్నాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎంపీపై అనర్హత వేటువేయాలని వైసీపీ ఇచ్చిన పిటీషన్ను సభాహక్కుల ఉల్లంఘన కమిటీ కొట్టేసింది. దీంతో ఎంపీపై అనర్హత వేటు వేయటం సాధ్యం కాదని తేలిపోయింది.

ఈ నేపధ్యంలోనే ఎంపీ మాట్లాడుతూ దమ్ముంటే తనను బహిష్కరించాలని సవాలు విసరడం గమనార్హం. ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించే ఉద్దేశ్యం జగన్మోహన్ రెడ్డికి లేదన్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీ నుంచి బహిష్కరిస్తే ఎంపీ స్వేచ్ఛా జీవి అయిపోతారు. అలా కాకుండా అనర్హత వేటు వేయించగలిగితే ఎంపీ మాజీ అవుతారు. అందుకనే బహిష్కరణ కాకుండా ఏకంగా అనర్హత విషయంలోనే పార్టీ పట్టుబట్టింది.

సరే ఈ విషయాలన్నీ ఇపుడు చరిత్రలో కలిసిపోయాయి కాబట్టి వాటి గురించి మాట్లాడుకుని ఉపయోగం లేదు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే దమ్ముంటే తనను పార్టీ నుంచి బహిష్కరించమని సవాలు విసురుతున్న రఘురామ ఎంపీగా రాజీనామా చేసి తనకు దమ్ముందని ఎందుకు నిరూపించుకోలేకపోతున్నారు.

ఒకపుడు తాను ఎంపీగా రాజీనామా చేయబోతున్నట్లు ఇదే రఘురామ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ముందు రాజీనామా చేస్తానని ప్రకటించి ఇపుడు రాజీనామా ప్రసక్తే లేదని యూ టర్న్ ఎందుకు తీసుకున్నట్లు ?

తాను రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిస్తే అత్యధిక మెజారిటీతో గెలుస్తానని చాలాసార్లు రఘురామ ప్రకటించారు. తనపై పోటీ చేస్తే జగన్ కూడా గెలవడని ఎంపీయే చెప్పుకున్నారు. తన గెలుపుపై అంతటి నమ్మకమే ఉంటే మరి వెంటనే రాజీనామా చేసి ఉపఎన్నికల్లో తిరిగి గెలవచ్చు కదా.

ఎంపీగా రాజీనామా చేసేంత దమ్ములేని రఘురామ తన బహిష్కరణ విషయంలో వైసీపీ దమ్ము గురించి సవాలు చేయటమే విచిత్రంగా ఉంది. వైసీపీ ఎంపీని బహిష్కరించేదిలేదు, ఎంపీ కూడా రాజీనామా చేసేది లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సవాళ్ళు-ప్రతిసవాళ్లు ఎందుకు పనికిరావు.
Tags:    

Similar News