పవన్‌ వారాహి వాహనంపై వైసీపీ సెటైర్లు మామాలుగా లేవుగా!

Update: 2022-12-13 04:56 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకోవడం కోసం జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వారాహి పేరుతో కొత్త వాహనాన్ని సిద్ధం చేయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇటీవల ఈ వాహనం ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అప్పటి నుంచి వైసీపీ నేతలు పవన్‌ పై విరుచుకుపడుతున్నారు.

పవన్‌ వాహనం వారాహి కాదు అని అది నారాహి అని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. అలాగే పవన్‌ వారాహి వాహనం ఆలివ్‌ గ్రీన్‌ రంగులో ఉందని.. అది ఇండియన్‌ ఆర్మీ రంగు అని.. దానికి రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తి కాదని.. నిబంధనలు ఒప్పుకోవని.. ఈ విషయం కూడా తెలియని అజ్ఞాని అని పవన్‌ పై వైసీపీ నేతలు పేర్ని నాని వంటి వారు తీవ్ర విమర్శలు చేశారు.

అయితే ఆ వాహనానికి తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. వాహనం బాడీ నిర్మాణం, రంగు అంతా నిబంధనలకనుగుణంగా ఉందని.. ఎక్కడా నిబంధనలను అతిక్రమించలేదని, ఆ వాహనం రంగు ఎమరాల్డ్‌ గ్రీన్‌ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ఆ రాష్ట్ర రవాణా ప్రాంతీయ కమిషనర్‌ పాపారావు వెల్లడించారు. దీంతో వైసీపీ నేతలు తమ విమర్శలను మరోవైపుకు తిప్పారు.

నిన్నమొన్నటి దాకా వారాహి వాహనానికి అస్సలు రిజిస్ట్రేషనే కాదని వైసీపీ నేతలంతా విమర్శలు చేయగా తెలంగాణలో ఆ వాహనానికి రిజిస్ట్రేషన్‌ పూర్తయిపోయింది. వారాహి వాహనానికి  తెలంగాణ రవాణా శాఖ డిసెంబర్‌ 8నే టీఎస్‌13ఈఎక్స్‌ 8384 నంబర్‌ను కేటాయించింది.

దీంతో వైసీపీ నేతలు మళ్లీ రూట్‌ మార్చారు. ఈసారి ఆ వాహనం నంబర్‌ 8384 కూడితే 23 వస్తుందని.. ఇది చంద్రబాబుకు ఇష్టమైన నంబర్‌ అంటూ జగన్‌ ప్రభుత్వంలో మంత్రి అయిన గుడివాడ అమర్‌నాథ్‌ తాజాగా విమర్శలు చేశారు. అంతేకాకుండా తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ అయినంత మాత్రాన ఏపీలో తాము ఒప్పుకోవాలని లేదన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. అలాగే ముగ్గురు ఎంపీలు సైతం వైసీపీని వదిలిపెట్టేశారు. ఇప్పుడు పవన్‌ వారాహి వాహనం మొత్తం నంబర్‌ 8384ని కూడితే 23 వస్తుందని.. చంద్రబాబు చేతిలో మనిషి పవన్‌ అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అలాగే 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు 23 మందేనని, చంద్రబాబుకు ఇష్టమైన నంబర్‌ 23ని తన వారాహి వాహనానికి పవన్‌ పెట్టుకున్నాడంటూ విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు జనసేన నేతలు అంతే గట్టిగా కౌంటర్లు వేస్తున్నారు. వైసీపీ నేతలకు నిబంధనలు ఏమీ తెలియవని.. అందుకే నిన్న మొన్నటి వరకు వారాహికి రిజిస్ట్రేషనే కాదని చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ వాహనానికి రిజిస్ట్రేషన్‌ పూర్తవడంతో వైసీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడిందని ఎద్దేవా చేస్తున్నారు. దీంతో మళ్లీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను కూడా పిచ్చి లెక్కలు వేసుకుని 23 వస్తోందంటూ గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి వ్యక్తులు జగన్‌ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News