టీటీడీ ఆస్తులపై వైసీపీ వ్యూహం.. ఈ నిర్ణ‌యం నిల‌బ‌డేనా?

Update: 2021-11-24 17:58 GMT
హిందూ ధార్మిక సంస్థ‌ల విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు తీవ్ర వివాదాల‌కు విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇస్తున్నాయి. ఇప్ప‌టికే చాలా నిర్ణయాల‌ను... హైకోర్టు కొట్టివేయ‌డం.. హిందూ సామాజిక వ‌ర్గాల నుంచి వెల్లువెత్తిన నిర‌స‌న‌ల‌తో ప్ర‌భుత్వమే కొన్ని నిర్ణ‌యాల‌ను వెన‌క్కి తీసుకోవ‌డం తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణ‌యాలు తీవ్ర వివాదాల‌కు దారితీస్తున్నాయి. వ‌రుస‌గా రెండు సార్లు వైసీపీ కీలక నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్ బాబాయి వైవీ సుబ్బారెడ్డికే చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ.. ఈ విష‌యంలో ముందుకే వెళ్లారు.

ఇక‌, ఇటీవ‌ల టీటీడీ బోర్డు విష‌యంలో ప్ర‌త్యేక ఆహ్వానితుల పేరిట 50 మందికి పైగా ఇత‌ర రాష్ట్రాల వారిని, త‌న పార్టీకి చెందిన పారిశ్రామిక వేత్త‌ల‌ను నియ‌మించ‌డంపైనా.. విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాస్త‌వ బోర్డు కోరంను మించి.. ప్ర‌త్యేక ఆహ్వానితుల‌తో.. స్వామి వారి సేవ‌ల‌పై పెత్త‌నం చేస్తున్నారంటూ.. తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 30 మంది ఉండాల్సిన బోర్డును ఏకంగా 80 మందికి మార్చ‌డంపై శ్రీవారి భ‌క్తులు సైతం.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌లేదు. దీంతో హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది. దీనిని విచారించిన కోర్టు చివ‌ర‌కు ప్ర‌భుత్వానికి అక్షింత‌లు వేసి.. స్టే ఇచ్చింది. అయితే.. దీనికి ఏకంగా టీటీడీ బోర్డు చ‌ట్టాల‌నే మార్చేందుకు స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇదిలావుంటే.. ఇప్పుడు మ‌రోసారి.. టీటీడీ గురించి స‌ర్కారుతీసుకున్న నిర్ణ‌యంపై మ‌రోసారి వివాదం రాజుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో  దేవదాయ, ధర్మదాయ చట్టానికి ప్రభు త్వం సవరణలు చేసింది. దీనిలో చేసిన కీల‌క స‌వ‌ర‌ణ‌లు.. హిందూ ధార్మిక సంస్థ‌లు, కీల‌క‌మైన టీటీడీపై దాడి చేసే ఉద్దేశంతో ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ధార్మిక పరిషత్‌ల‌ను త‌న హ‌యాంలోకి తెచ్చుకుంది. 21 మందిలో నలుగురు అధికారులు ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా ఉంటే, వివిధ రంగాలకు చెందిన 17 మందిని ప్రభుత్వం నియమిస్తుంది. అంటే.. మెజారిటీ అధికారులు ప్ర‌భుత్వం నుంచే వ‌స్తారు.

రూ.25 లక్షల నుంచి రూ.ఒక కోటి మధ్య ఆదాయం వస్తున్న పెద్ద ఆలయాలకు ట్రస్టుబోర్డుల నియమించడం లాంటి కీలక బాధ్యతను కూడా ధార్మిక పరిషత్‌కు అప్పగించింది. అలాగే మఠాధిపతులను తొలగించడం, కొత్త మఠాధిపతులను గుర్తించడం, ఖాళీలను భర్తీ చేయడం వంటి బాధ్యతలు అప్పగించడంతో మఠాలపై పూర్తి అధికారాలు ధార్మిక పరిషత్‌కు సంక్రమించాయి. మ‌రో కీల‌క‌మైన విష‌యం.. టీటీడీ ఏటా దేవదాయశాఖకు ఇచ్చే మొత్తాన్ని పెంచే లా దేవదాయ చట్టంలో మార్పులు చేసి పెట్టిన బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటివరకూ ఏటా రూ.2.25 కోట్లు ఇచ్చిన టీటీడీ ఇకనుంచి ఒక్కసారిగా రూ.50 కోట్ల మేర‌కు దేవదాయశాఖకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది పూర్తిగా టీటీడీ ఆస్తుల‌ను ప్ర‌భుత్వం లాగేసుకోవ‌డ‌మేన‌ని అంటున్నారు హిందూ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు. ఇప్ప‌టికే టీటీడీ ఆస్తులపై స‌ర్కారు క‌న్నేసింద‌నే వాద‌న వినిపిస్తున్న నేప‌థ్యంలో తాజాగా చేసిన బిల్లు.. మ‌రింత వివాదానికి కార‌ణ‌మ‌వుతోంది. మ‌రి దీనిపై మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News