'ధ‌ర్మ‌పోరాటాన్ని' డామినేట్ చేసిన 'వంచ‌న దీక్ష‌'!

Update: 2018-04-30 14:07 GMT
2014 ఏప్రిల్ 30న క‌లియుగ దైవం తిరుమల వెంకన్న సాక్షిగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. తిరుప‌తిలోని  ప్ర‌తిష్టాత్మ‌క‌ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తారకరామ స్టేడియంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన చట్టంలోని హామీల‌ను అమలు చేస్తామని మోదీ బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు. ఆ హామీలు ఇచ్చి నాలుగేళ్లు గ‌డుస్తున్నా....వాటిని నెర‌వేర్చ‌ని మోదీపై ఏపీ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. మోదీ చేసిన వంచ‌న‌ను గుర్తు చేసుకుంటూ....నేడు  విశాఖపట్నం వేదికగా  వైఎస్సార్‌సీపీ నేతలు ‘వంచన వ్యతిరేక దీక్ష’ ను నిర్వ‌హించారు. తిరుప‌తిలో ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు నిర్వ‌హిస్తోన్న `ధ‌ర్మ‌పోరాట దీక్ష‌`ను వైసీపీ నేత‌ల `వంచ‌న వ్య‌తిరేక దీక్ష‌` డామినేట్ చేసింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ముందు నుంచి పోరాడుతోన్న వైసీపీ చేప‌ట్టిన దీక్ష‌కు ప్ర‌జాద‌ర‌ణ‌తో పాటు మీడియా క‌వ‌రేజి కూడా ఎక్కువ‌గా ల‌భించింది.

విశాఖ ప‌ట్నంలోని ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన దీక్ష‌కు ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చారు. ఈ దీక్ష‌కు ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజ‌రయ్యారు. వైసీపీ చేపట్టిన దీక్ష‌కు చంద్ర‌బాబు దీక్ష కంటే ఎక్కువ‌గా మీడియా ప్రాధాన్య‌త ద‌క్కింది. దాదాపుగా అన్ని చానెళ్లు ఈ దీక్ష‌ను ఎక్స్ క్లూజివ్ గా క‌వ‌ర్ చేశాయి. చాలామంది వైసీపీ నేత‌లు న‌ల్ల చొక్కాలు ధ‌రించి ఈ దీక్ష‌కు హాజ‌రై త‌మ నిర‌స‌న‌ను తెలిపారు. వైసీపీ ఎంపీ మేక‌పాటి మోహ‌న్ రెడ్డి ఈ దీక్ష‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు, బీజేపీ పై వైసీపీ నేత‌లు నిప్పులు చెరిగారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా తెస్తామంటూ చంద్ర‌బాబు...ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని వైసీపీ నేత అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. ప్ర‌ధాని మోదీ, ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, చంద్ర‌బాబు,జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌...ఏపీ ప్ర‌జ‌ల‌ను ప్ర‌త్యేక హోదా విష‌యంలో మోసం చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. అయితే, ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌ధాని చెప్ప‌లేద‌ని ఇపుడు బీజేపీ నేత‌లు బుకాయిస్తున్నార‌ని రాంబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొద‌టి నుంచి ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతోన్న పార్టీ వైసీపీ అని, ప్ర‌ధాని మోదీ...ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లార‌ని...చంద్ర‌బాబు హోదాపై యూట‌ర్న్ తీసుకున్నార‌ని మండి ప‌డ్డారు.

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిప్పులు చెరిగారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్ర‌త్యేక హోదా కోసం అనేక పోరాటాలు చేశారని, హోదా కోసం గుంటూరులో చేస్తోన్న ఆమరణ దీక్షను భ‌గ్నం చేసిన పాపం చంద్ర‌బాబుద‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ఏనాడు హోదా కోసం పోరాడ‌లేద‌ని, జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించ వెంట‌నే ఆయ‌న‌ను సన్మానించిన ఘనుడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు.  హోదా సాధన కోసం అవిశ్వాసంపై అన్ని పార్టీలను తాము ఒప్పించామ‌ని, రాజీనామాలు చేసి నిరవధిక దీక్షకు పూనుకున్నామ‌ని చెప్పారు. ఏపీ ప్రజలను ఇంకా వంచించేందుకు చంద్ర‌బాబు `ధ‌ర్మ‌పోరాట దీక్ష‌`చేస్తున్నార‌ని, 30 కోట్లు వృథా చేసి గుంటూరులో స‌భ పెట్టార‌ని మండిప‌డ్డారు. నేడు చేస్తోన్న దీక్ష విష‌యంలో ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో చంద్ర‌బాబు సభ ఎందుకు పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు
Tags:    

Similar News