వైసీపీ - టీఆరెస్ - బీజేపీ - కాంగ్రెస్..పార్టీ ఏదైనా ఆయనదే పలుకుబడి

Update: 2020-02-29 01:30 GMT
నాయకులు రెండు రకాలు.. కొందరు నిత్యం జనాల్లో, మీడియాలో కనిపిస్తూ హడావుడి చేసేరకం... మరికొందరు ఎక్కడున్నారో, అసలున్నారో లేదో తెలియనంత సైలెంటుగా ఉంటూనే సమస్తం సాధించుకునే రకాలు. అలాంటి రెండో రకానికి చెందిన ఓ కీలక కాంగ్రెస్ నేత 2014 నుంచి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా జనం, మీడియా దృష్టిలో పడకుండా ఉన్నారు. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు.. కొద్దిరోజుల్లో ఆయన పదవీ కాలం ముగియనుంది. మళ్లీ ఆయన రాజ్యసభ సభ్యత్వం కొనసాగడానికి కాంగ్రెస్ పార్టీకి అంతబలం లేక పోవడంతో ఆయన కొనసాగింపు కష్టమేనన్న మాట రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. అయితే.... పదవి లేకున్నా పలుకుబడికి లోటు లేకుండా ఉన్న ఆయన దిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆరెస్ పార్టీలు నాలుగింట్లోనూ ఆయన మాటే చెల్లుబాటవుతోందని ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా బీజేపీ ఏపీ, తెలంగాణ రెండు చోట్లా విస్తరించే ప్రయత్నాల్లో ఉంటూ అక్కడ అధ్యక్షులను మార్చాలనే యోచనలో ఉంది. అందుకు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు బీజేపీ నేతల పేర్లు ఈ కాంగ్రెస్ నేతే ముందుకు తెచ్చారని తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో విశాఖకు చెందిన నేత మాధవ్‌ ను పార్టీ అధ్యక్షుడిని చేసేందుకు ఈయన పావులు కదుపుతున్నట్లు టాక్. దీంతో ఆ ఇద్దరు ప్రాబబుల్స్‌ తో పోటీ పడుతున్న మిగతా బీజేపీ నేతలు తమ పార్టీలో ఈ కాంగ్రెస్ లీడర్ లాబీయింగ్ ఏంటని రుసరుసలాడుతున్నారు.

ఇక వైసీపీలోనూ కొత్త ఎంపీలు, పాత ఎంపీలు కూడా ఈ కాంగ్రెస్ నేతను తరచూ కలుస్తూ ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. పార్టీలో కానీ, దిల్లీలో కానీ ఎదుగుదలకు ఏం చేయాలా అని ఆయన సలహాలు తీసుకుంటున్నారట.
మరోవైపు రెండు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీలోనూ ఈయనకు తెలియకుండా ఏ చిన్న డెవలప్‌మెంట్ కానీ, నియామకాలు కానీ జరగడం లేదు. అధిష్ఠానం ఆయన మాట బాగానే వింటోంది. ఇక టీఆరెస్‌లోనూ ఆయన మాట బాగా చెల్లుబాటవుతోందని సమాచారం. నేరుగా ఆయన టీఆరెస్ పెద్దలతోనే టచ్‌లో ఉంటున్నారని తెలుస్తోంది.


Tags:    

Similar News