బీజేపీ అగ్రనేతలనే భయపెట్టిన యడ్డీ ?

Update: 2021-07-29 07:18 GMT
చదవటానికి విచిత్రంగానే ఉన్నా తెరవెనుక జరిగింది మాత్రం అచ్చంగా ఇదే. మాజీ సీఎం యడ్యూరప్ప స్ధానంలో ముఖ్యమంత్రిగా బసవారజ్ బొమ్మై ఎంపిక చూస్తేనే అసలు విషయం ఏమిటో తెలిసిపోతుంది. కేవలం కర్నాటకలో బలమైన, రాజకీయాలను శాసించే స్ధాయిలో ఉన్న లింగాయత్ సామాజికవర్గం ఒత్తిడికి లొంగిపోయిన విషయం అర్ధమైపోతోంది. రాజకీయంగా లింగాయత్ సామాజికవర్గం మొత్తం యడ్డీ చుట్టూనే తిరుగుతుంటాయి. కాబట్టి తన సక్సెసర్ గా బొమ్మైనే ఎంపిక చేయాలని యడ్డీ అగ్రనేతలపై బాగా ఒత్తిడి తెచ్చారని సమాచారం.

యడ్డీ ఒత్తిడిని తట్టుకోలేక చివరకు బొమ్మైనే కుర్చీలో కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి ఎంపికలో కేంద్రమంత్రులు ధర్మేంద్ర్రప్రధాన్+కిషన్ రెడ్డి కీలకపాత్ర పోషిస్తారని ఢిల్లీలో ప్రకటించినా చివరకు యడ్డీనే కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిపోయింది. లింగాయత్ కు చెందిన బొమ్మైతో పాటు వక్కలిగ, బ్రాహ్మణ సామాజికవర్గాలకు చెందిన నేతలు కూడా గట్టిగానే సీఎం కుర్చీకోసం ప్రయత్నాలు చేశారు. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరకు నెగ్గింది మాత్రం లింగాయత్ లనే చెప్పాలి.

కర్నాటకలో లింగాయత్ సామాజికవర్గం జనాభా సుమారు 20 శాతమట. వీళ్ళ తర్వాతే వక్కలిగ, బ్రాహ్మణులు. లింగాయతులను కాదని ఇంకెవరిని సీఎంను చేసినా యడ్యూరప్ప వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరనే ఆరోపణలున్నాయి. గతంలో యడ్డీ తర్వాత సీఎంలయిన వాళ్ళు మధ్యలోనే దిగిపోవటమే ఈ ఆరోపణలకు మద్దతుగా నిలుస్తున్నాయి. సరే ఎవరి సామాజికవర్గం బలమెంతైనా లింగాయత్ లను కాదని బీజేపీ చేయగలిగేది ఏమీలేదని మరోసారి తేలిపోయింది.

తన తర్వాత వారసుడిగా ఎవరుండాలనే విషయాన్ని యడ్డీనే స్వయంగా నిర్ణయించారు. అందుకనే బీజేపీ అగ్రనేతలను భయపెట్టి మరీ తన సామాజికవర్గానికే చెందిన బొమ్మైని యడ్డీలో కుర్చీలో కూర్చోబెట్టారు. మరిపుడు బొమ్మై స్వతంత్రంగా పాలన చేయగలరా ? లేకపోతే యడ్డీ చేతిలో కీలుబొమ్మలాగ తయారవుతారా అన్నది చూడాలి. ఎందుకంటే అసలే బొమ్మైకి సాత్వికునిగా పేరుంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాల్సిందే.


Tags:    

Similar News