అమిత్‌ షా కామెంట్లు..య‌డ్డీ లేఖ...కొత్త స‌మీక‌ర‌ణాలు

Update: 2018-05-22 14:07 GMT
క‌ర్ణాటక రాజ‌కీయాలు మ‌రిన్ని మ‌లుపులు తిరుగుతున్నాయి. ఓ వైపు  కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి తరపున జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌ డీ కుమారస్వామి ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్న స‌మ‌యంలో మాజీ ముఖ్య‌మంత్రి య‌డ్యుర‌ప్ప సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు సాధించిన విషయం విదితమే. దీంతో యడ్యూరప్ప తనకు సంఖ్యాబలం లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించారు. ఆ రాష్ట్ర విధానసభలో బలపరీక్ష కంటే ముందే సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు యడ్డీ ప్రకటించడం, ఆ తర్వాత రాజ్‌ భవన్‌ కు వెళ్లి గవర్నర్‌ కు యడ్యూరప్ప రాజీనామా లేఖ సమర్పించ‌డం సంగతి తెలిసిందే.

అయితే ఓవైపు కుమార‌స్వామి పీఠం ఎక్కేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప ఎన్నికల సంఘానికి సంచ‌ల‌న‌ లేఖ రాశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆయ‌న ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలు జరగడం ఇదే మొదటిసారి కాదన్నారు. గ్రౌండ్ లెవల్‌ లో ఎన్నికల సందర్భంగా అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేదని వాపోయారు. విజయపూర్ జిల్లాలోని మణగులి గ్రామంలో వీవీప్యాట్ మిషన్లు ఖాళీగా పడి ఉన్నాయన్నారు. కొన్ని చోట్ల ఈవీఎం మిషన్లను కౌంటింగ్ కేంద్రాలకు తీసుకురాకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని యడ్యూరప్ప పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల అధికారులు స్పందించి.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా కామెంట్లు చేసిన మ‌రుస‌టి రోజే య‌డ్యుర‌ప్ప ఈ కామెంట్లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. క‌ర్ణాట‌క‌లో తిరిగి ఎన్నిక‌లు జ‌ర‌గాల‌నే ప్ర‌తిపాద‌న‌లు త‌న దృష్టికి వ‌స్తున్నాయ‌ని అమిత్ షా తెలిపారు. అయితే ఇది రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన డిమాండా అనేది ప‌రిశీలిస్తున్నామ‌న్నారు. అమిత్‌షా ఢిల్లీలో ఏర్పాటుచేసి విలేక‌రుల స‌మావేశంలో ఈ కామెంట్లు చేసిన మ‌రుస‌టి రోజే య‌డ్యుర‌ప్ప ఈ లేఖ రాయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News