పసుపు జ్వరం : ఉత్తరాంధ్రా ఊపేస్తోంది...?

Update: 2022-06-19 02:30 GMT
విభజన ఏపీలో అతి కీలకమైన రాజకీయ ప్రాంతం ఉత్తరాంధ్రా. మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్న ఉత్తరాంధ్రా రెండు ఎన్నికల్లో చంద్రబాబుని ఒకసారి జగన్ని ఒకసారి ముఖ్యమంత్రులను చేసింది. ఈ ప్రాంతంలో గాలి మళ్ళితే చాలు ఏపీ రాజకీయం కూడా దానికి అనుగుణంగా మారుతుంది. ఇపుడు అదే జరుగుతోందా అంటే అవును అని జవాబు వస్తోంది.

చంద్రబాబు జిల్లా టూర్లు చేస్తూంటే జనాలు విరగబడి వస్తున్నారు. ఏ ఒక్క నాయకుడు కూడా అసలు  జనసమీకరణ చేయడంలేదు. వచ్చిన వారు అంతా స్వచ్చందంగానే అని తెలిసిపోతోంది. చంద్రబాబు గంటల తరబడి చేస్తున్న ప్రసంగాలను ఆసక్తిగా వింటూ అంతసేపు నిలబడి ఉన్నారు అంటే కచ్చితంగా అది చంద్రబాబు మీద నమ్మకం, తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ అని అర్ధం అవుతోంది.

ఇక ఉత్తరాంధా టూర్ లో చంద్రబాబుకు ఈసారి మరింత ధీమా పెరిగింది. ఎక్కడికి వెళ్ళినా ముందే జనాలు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. అంతే కాదు, బాబు ఏం చెప్పినా వారు చప్పట్లతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ సర్కార్ మీద ఆయన చేస్తున్న విమర్శలను వారు ఆహ్వానిస్తున్నారు అంటే వాతావరణం ఏదో తేడా కొడుతోంది అనుకోవాలి.

చోడవరం లాంటి చోట మినీ మహానాడు పెడితే లక్షకు పైగా జనాలు వచ్చారు అంటేనే టీడీపీ పట్ల జనాదరణ ఎంత పెరిగిందో అర్ధమవుతోంది. ఇక అనకాపల్లిలో చూస్తే బాబు సభలలో జన సందోహంతో ఇసుక వేస్తే రాలనంతగా కనిపించారు. విజయనగరం జిల్లాలో 2019 లో ఒక్క సీటూ టీడీపీకి లేకుండా తీర్పు చెప్పిన చోటనే ఇపుడు జనాలు కదలి వచ్చి నీరాజనాలు పలుకుతున్నారు.

నెల్లిమర్ల రోడ్ షోలో ఎటు చూసినా జనాలు కిటకిటలాడారు. అలాగే బొత్స ఇలాకాలో కూడా వెల్లువలా తరలివచ్చారు. ఇక్కడ ఒక విషయం అయితే స్పష్టం అయింది. టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఇంకా నెమ్మదిగానే ఉన్నారు. కానీ బాబు ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తున్నారు అంటే ఏ ఒక్కరూ ప్రయాస పడకుండా పైసలు తీయకుండానే ఇది సాధ్యమైంది అంటే కచ్చితంగా గాలి మారింది అనే చెప్పాలి.

ఈ జనాలను చూసి చంద్రబాబు కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. నేను ఏపీని రిపేరు చేస్తాను, మీ అందరి నమ్మకాన్ని నిలబెడతాను అని ఆయన హామీ ఇస్తున్నారు. ఏపీ ఇపుడు అసమర్ధుల చేతుల్లో ఉంది. దాన్ని దారికి పెట్టే బాధ్యతను నేను తీసుకుంటాను అని బాబు చెప్పడం కూడా జనాలకు ఎక్కడ లేని ఆనందాన్ని కలిగిస్తోంది.

మొత్తం మీద చూస్తే వైసీపీని ఉత్తరాంధ్రా జిల్లాల  నిండా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఆఖరుకు పంచాయతీలలో వార్డు మెంబర్లు కూడా ఆ పార్టీ వారే ఉన్నారు. బీసీ కార్పోరేషన్లు  పెట్టి  ఎక్కువగా ఈ ప్రాంతానికే ఇచ్చారు. ఇక విశాఖను రాజధాని చేస్తామని చెప్పారు. అలాగే కాపులకు  వెలమలకు పెద్ద పీట వేసి మంత్రి  పదవులు ఇచ్చారు. ఎస్టీలను ఉప ముఖ్యమంత్రి చేశారు.

ఇంత చేసినా కూడా ఫ్యాన్ నీడన ఉక్క బోత అని జనాలు అంటున్నారు అంటే అధికార పార్టీ ఆలోచించాల్సిందే. నాయకులు జనాలకు మధ్య ఏదో తెలియని గ్యాప్ అయితే ఏర్పడింది. అది గడప గడపకూ ప్రోగ్రాం లో కచ్చితంగా కనిపించింది.

దాంతో  ఉత్తరాంధ్రా  ఈసారి బొమ్మ తిరగబడడం ఖాయమని అంటున్నారు. 34 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సీట్లు పసుపు ఖాతాలో పడతాయని ఆ పార్టీ వారు అంచనా వేస్తున్నారు. గాలి మరీ ప్రభంజనం అయితే పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తామని కూడా చెబుతున్నారు. మొత్తానికి పసుపు జ్వరంతో ఉత్తరాంధ్రా వేడెక్కిపోతోంది అని చెప్పాలేమో.
Tags:    

Similar News