ఆ విష‌యంలో తొంద‌ర‌ప‌డ్డావ్ యోగి!

Update: 2017-04-23 09:05 GMT
అనూహ్య రీతిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్  ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చున్న యోగి ఆదిత్య‌నాథ‌న్‌.. తన చేతికి ప‌వ‌ర్ వ‌చ్చిన నాటి నుంచి ఎంత‌లా చెల‌రేగిపోతున్నారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. రోజుల‌తో పోటీ ప‌డుతూ.. ప‌లు నిర్ణ‌యాల్ని తీసుకోవ‌ట‌మే కాదు.. త‌న మార్క్ పాల‌న ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చేశారు. సీఎం కాక మునుపు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో మాత్ర‌మే సుప‌రిచిత‌మైన యోగి.. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత నుంచి ఆచితూచి వ్యాఖ్య‌లు చేయ‌టం.. నిర్ణ‌యాల విష‌యంలోనూ ఎవ‌రూ వేలెత్తి చూపించేలా నిర్ణ‌యాలు తీసుకుంటున‌న ఆయ‌న‌.. తాజాగా తీసుకున్న నిర్ణ‌యం మాత్రం ప్ర‌శ్నించేలా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

యూపీ మాజీ ముఖ్య‌మంత్రులు ములాయంసింగ్ యాద‌వ్‌.. అఖిలేష్ యాద‌వ్‌.. మాయావ‌తితో పాటు.. ములాయం కుటుంబ స‌భ్యులు డింపుల్ యాద‌వ్‌.. శివ‌పాల్‌యాద‌వ్‌.. రాంగోపాల్ యాద‌వ్ ఇలా ప్ర‌ముఖ నేత‌ల‌కు ఇంత కాలం ఇస్తున్న భ‌ద్ర‌త‌ను కుదిస్తూ ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

భ‌ద్ర‌త త‌గ్గింపు విష‌యంలో అందరి విష‌యంలో ఒకే తీరు ప్ర‌ద‌ర్శించినా బాగుండేది. కానీ.. అందుకు భిన్నంగా.. విప‌క్ష నేత‌ల భ‌ద్ర‌త త‌గ్గించిన యోగి.. బీజేపీ నేత‌ల భ‌ద్ర‌త‌ను మాత్రం పెంచ‌టం గ‌మ‌నార్హం. బీజేపీ సీనియ‌ర్ నేత విన‌య్ క‌టియార్ తో పాటు మ‌రికొంద‌రి భ‌ద్ర‌త‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిపై విప‌క్షాలు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నాయి. వివ‌క్ష‌త‌తోనే విప‌క్షాల విష‌యంలో ముఖ్య‌మంత్రి ఇలా వ్య‌వ‌హ‌ర‌స్తున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మాజీ ముఖ్య‌మంత్రుల భ‌ద్ర‌త కుదించిన యోగి.. విన‌య్ క‌టియార్‌ కు ఏకంగా జెడ్ కేట‌గిరి భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌టం గ‌మ‌నార్హం.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 151 మంది వీఐపీలు భారీ భ‌ద్ర‌త‌ను పొందుతున్నారు. వీరికి సంబంధించి రివ్యూ నిర్వ‌హించిన యోగి.. 46 మంది ప్ర‌ముఖుల‌కు భ‌ద్ర‌త త‌గ్గించ‌గా.. మ‌రో 105 మందికి పూర్తిగా భ‌ద్ర‌త ఉప‌సంహ‌రించి సంచ‌ల‌నానికి తెర తీశారు. సెక్యురిటీ క‌లిగి ఉండ‌టం హోదాకు గుర్తుగా భావిస్తున్నార‌ని.. ఆ భ‌ద్ర‌తా సిబ్బందిని సామాన్యుల ర‌క్ష‌ణ కోసం వినియోగించ‌నున్న‌ట్లుగా యోగి చెబుతున్నారు. అదే నిజ‌మైతే.. ప‌లువురు బీజేపీ నేత‌ల‌కు భారీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌టం ఏమిట‌న్న‌ది అస‌లు ప్ర‌శ్న‌.

నిజానికి యోగి తీసుకున్న నిర్ణ‌యంపై మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. విప‌క్షాల భ‌ద్ర‌త మీద గురి పెట్టిన యోగి.. సొంత పార్టీ నేత‌లకు మాత్రం భ‌ద్ర‌త ఎందుకు పెంచిన‌ట్లు? అన్న సూటిప్ర‌శ్న‌ను ప‌లువురు అడుగుతున్నారు. ఇదే కాదు.. మిగిలిన రాజ‌కీయ అధినేత‌ల మాదిరే.. త‌న నిర్ణ‌యాలు కూడా ఉంటాయ‌న్న‌విష‌యాన్ని తాజా ఉదంతంతో యోగి స్ప‌ష్టం చేసిన‌ట్లుగా చెప్పాలి. ఎందుకంటే.. అధికార బ‌దిలీ జ‌రిగిన వెంట‌నే.. ఏ అధినేత అయినా చేసే ప‌ని.. త‌మ వారికి సెక్యురిటీ పెంచేసి.. ప్ర‌త్య‌ర్థుల భ‌ద్ర‌త‌ను కుదించ‌టం. ఇలాంటి కాలం చెల్లిన రాజ‌కీయాల‌కు ఇప్పుడు ఆద‌ర‌ణ లేదు. ఆ విష‌యాన్ని యోగి మిస్ అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఏమైనా.. భ‌ద్ర‌త కుదింపు విష‌యంలో యోగి ప‌క్ష‌పాతం స్ప‌ష్టం క‌నిపిస్తోంద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News