ఇఫ్తార్ లైట్ అంటున్న సీఎం యోగి

Update: 2017-06-05 09:17 GMT
సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకోవ‌టం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ కు కొత్తేం కాదు. కొన్ని విష‌యాల్లో ఆయ‌న త‌న తీరును అస్స‌లు దాచి పెట్టుకోరు. మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చూపించ‌టానికి అస్స‌లు వెనుకాడ‌రు. చాలా రాష్ట్రాల్లో రంజాన్ వ‌చ్చిందంటే చాలు.. అధికార పార్టీలు ఇఫ్తార్ విందులు ఇచ్చేస్తుంటాయి.  ఇదంతా కూడా మైనార్టీ ఓటు బ్యాంకు కోస‌మేన‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నా.. ఎంతోకాలంగా సంప్ర‌దాయంగా వ‌చ్చే విధానానికి బ్రేక్ వేసే సాహ‌సం చేయ‌లేక కంటిన్యూ చేయ‌టం క‌నిపిస్తుంది.

తాజాగా మాత్రం యూపీ ముఖ్య‌మంత్రి యోగి మాత్రం.. ఈసారి ఇఫ్తార్ విందు ఇచ్చే విష‌యంలో సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టం ప‌క్కా అన్న మాట బ‌లంగా వినిపిస్తోంది. గ‌త ముఖ్య‌మంత్రుల మాదిరి ఆయ‌న ఇఫ్తార్ విందు ఇవ్వ‌క‌పోవ‌చ్చంటున్నారు. ఇప్పుడు వినిపిస్తున్న అంచ‌నాలు నిజ‌మైన ప‌క్షంలో.. రంజాన్ వేళ ఇఫ్తార్ విందు ఇవ్వ‌కుండా మానేసిన రెండో బీజేపీ సీఎంగా యోగి నిలుస్తార‌ని చెబుతున్నారు. గ‌తంలో రామ్ ప్ర‌కాష్ గుప్తా కూడా ఇదే తీరులో ఇఫ్తార్ విందు ఇవ్వ‌లేద‌ని.. ఇప్పుడు యోగి అలానే చేస్తారా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఏప్రిల్ లో వ‌చ్చే చైత్ర న‌వ‌రాత్రి సంద‌ర్భంగా బీజేపీ నేత‌ల‌కు సీఎం యోగి ఒక ఫ‌ల‌హార విందును ఏర్పాటు చేసి కొత్త త‌ర‌హా సంప్ర‌దాయానికి తెర తీశారు. మ‌రి.. ఇఫ్తార్ విందు విష‌యంలో ఆయ‌న ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు? అన్న ప్ర‌శ్న‌పై జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

దేశంలో లౌకిక వాదాన్ని కాపాడేందుకే ఇఫ్తార్ విందుల‌ని చెబుతున్నారు ఆలిండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు స‌భ్యుడు ఖాలిద్ ర‌షీద్ ఫిరంగీ మ‌హాలీ. ఇక‌.. ఇఫ్తార్ విందు విష‌యానికి వ‌స్తే.. ప్ర‌ధాని మోడీ కూడా ఇవ్వ‌టం లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. యూపీ సీఎం యోగి ఇఫ్తార్ విందు ఇచ్చినా.. ఇవ్వ‌కున్నా తాము మాత్రం విందు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేస్తోంది ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం రాష్ట్రీయ ముస్లిం మంచ్. సంఘ్ నుంచి వ‌చ్చిన యోగి ఇఫ్తార్ విందు ఇవ్వ‌క‌పోవ‌టం ఏమిటో.. ఆయ‌న తూచా త‌ప్ప‌కుండా ఫాలో అయ్యే అదే సంఘ్ ప‌రివార్ మాత్రం.. ఇఫ్తార్ విందు ఇవ్వ‌టం ఏమిటో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News