సంచ‌ల‌నంతో పాపాలు తుడిచేసుకోవ‌ట‌మా యోగి?

Update: 2018-04-19 05:19 GMT
చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటే..?  క‌ళ్ల ముందు క‌నిపిస్తున్న త‌ప్పును త‌ప్పుగా చెప్పేంత ధైర్యం లేనోళ్లు.. ఇప్పుడేదో పొడిచేస్తామంటూ భారీ డైలాగులు చెబితే న‌మ్మేందుకు జ‌నాలేమీ వెర్రి ప‌ప్పాలు కాదు. న‌డుస్తున్న డిజిట‌ల్ యుగంలో ఇప్పుడంతా ఓపెన్. ఎవ‌రు.. ఏ విష‌య‌మైనా తెలుసుకునే వీలుంది. త‌ప్పులు చేసి దాచి పెట్టే ప్ర‌య‌త్నం చేస్తే అంత‌కు మించిన డ్యామేజీ మ‌రింకేమీ ఉండ‌దు.

దాని కంటే చేసిన త‌ప్పును బుద్ధిగా ఒప్పుకొని చెంప‌లేసుకుంటే క్ష‌మించేయ‌టానికి జ‌నం సిద్ధంగా ఉన్నార‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. అలాంటివేళ‌.. కాలం చెల్లిన చెత్త ఐడియాలు వేస్తే మొద‌టికే మోసం రావ‌టం ఖాయం. అయితే.. ఇలాంటి విష‌యాల మీద కొంద‌రు ముఖ్య‌నేత‌ల‌కు అవ‌స‌ర‌మైనంత అవ‌గాహ‌న రాలేద‌న్నట్లుగా ఉంది వారి ధోర‌ణి చూస్తుంటే.

ఎవ‌రిదాకానో ఎందుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ య‌వ్వార‌మే తీసుకోండి. త‌న పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఒక‌రు.. ఎమ్మెల్యే ఒక‌రు అత్యాచార ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన‌ప్పుడు వారి మీద చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో ఆయ‌న వెన‌క‌డుగు వేయ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మ‌సి పూసి మారేడుకాయ చేద్దామ‌ని అనుకున్నా.. అది సాధ్యం కాని ప‌రిస్థితి. తీరా క‌ఠిన నిర్ణ‌యం తీసుకునే స‌మ‌యానికి  అధినాయ‌క‌త్వం నుంచి వ‌చ్చిన ఆదేశాల్ని పాటించ‌క త‌ప్ప‌ని దుస్థితి.

ఇదంతా చేసినందుకు ప్ర‌జాక్షేత్రంలో యోగి స‌ర్కారుకు జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగిపోయింది. దీంతో.. న‌ష్ట నివార‌ణ కోసం వేస్తున్న ఎత్తులు ఎంత మేర సాయం చేస్తాయ‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. దేశ వ్యాప్తంగా ఒక కుదుపు కుదిపేసిన క‌థువా ఉదంతం నేప‌థ్యంలో కొంద‌రు మ‌హిళా నేత‌లు రేపిస్టుల‌కు ఉరి వేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌లు చేశారు. తాజాగా ఇప్పుడా జాబితాలో చేరారు యూపీ ముఖ్య‌మంత్రి యోగి.

అత్యాచారం చేసిన ఘ‌ట‌న‌ల్లో నిందితులు చేసిన త‌ప్పు నిరూపిత‌మైతే.. వారికి మ‌ర‌ణ‌దండ‌న విధించేలా ప్ర‌తిపాద‌న‌లు కేంద్రానికి పంపాల‌న్న నిర్ణ‌యాన్ని ఆయ‌న తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ను ఆయ‌న కేంద్రానికి పంపేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. రేపిస్టుల‌కు మ‌ర‌ణ‌దండ‌న విధించేలా కొత్త బిల్లుల్ని ఇప్ప‌టికే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్థాన్.. హ‌ర్యానా.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాలు కొత్త బిల్లుల్ని ఆమోదించాయి. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సైతం ప్ర‌క‌టించారు.

ఇప్పుడు ఇదే బాట‌లో యోగి ఇప్పుడు న‌డుస్తున్నారు. రేపిస్టుల‌కు మ‌ర‌ణ‌దండ‌న విధించేందుకు వీలుగా తాము రూపొందించిన ప్ర‌తిపాద‌న‌ల్ని కేంద్రానికి పంపుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. రేపిస్టుల‌కు మ‌ర‌ణ‌దండ‌న స‌బ‌బే. కానీ.. అంత‌కు ముందు.. త‌మ రాష్ట్రంలో తెర మీద‌కు వ‌చ్చిన అత్యాచార ఉదంతాల్లో నిందితుల విష‌యంలో చ‌ట్టం తానేం చేయాలో అది చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ప‌టిష్ట‌మైన చ‌ట్టాలున్నా.. వాటిని అమ‌లు చేసే యంత్రాంగం.. అధికార వ్య‌వ‌స్థా లేన‌ప్పుడు ఉప‌యోగం ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఈ త‌ర‌హా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పిన త‌ర్వాత రేపిస్టుల‌కు ఉరి అంటూ బ‌డాయి మాట‌ల్ని యోగి చెబితే బాగుంటుంది.
Tags:    

Similar News