ఆ సీఎం చెల్లెలు.. టీ అమ్ముతుంటారు!

Update: 2018-03-22 05:08 GMT
పాల‌న విష‌యంలో వంక పెట్టొచ్చు కానీ.. కొన్ని విష‌యాల్లో బీజేపీ నేత‌లు అనుస‌రించే తీరు రోటీన్ కు భిన్నంగా ఉంటుంది. సంప్ర‌దాయ రాజ‌కీయ నేత‌లు ఎవ‌రిని చూసినా.. తాము ఒక పొజిష‌న్లోకి వ‌చ్చినంత‌నే.. త‌మ కుటుంబ స‌భ్యుల బాగోగులు చూసుకోవ‌టమే కాదు.. త‌మ చుట్టూ వారిని ఉంచేసుకోవ‌టం క‌నిపిస్తుంది. తొలుత కుటుంబ స‌భ్యులు.. ఆ త‌ర్వాత బంధు వ‌ర్గాన్ని చేర‌తీయ‌టం క‌నిపిస్తుంది.

కానీ.. బీజేపీ నేత‌ల తీరు కాస్త బిన్నంగా ప్ర‌ధాని మోడీ ద‌గ్గ‌ర నుంచి యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ వ‌ర‌కూ వారి కుటుంబ స‌భ్యుల‌కు చాలా దూరంగా ఉంటారు. అంతేకాదు.. త‌మ ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌రు. ఇలాంటివి చూసిన‌ప్పుడు.. స‌గ‌టు రాజ‌కీయ నేత‌ల‌కు ఎంత భిన్న‌మ‌న్న భావ‌న క‌నిపిస్తుంటుంది. అలా అని వీరు ఎవ‌రికి సాయం చేయ‌కుండా ఉంటారా? అంటే.. వారి సాయం చేసే వారి జాబితాలు వారి ప్ర‌త్య‌ర్థులు త‌ర‌చూ చెబుతూనే ఉంటారు.

ఇలా చూసిన‌ప్పుడు అయినోళ్ల‌కు సైతం పెట్ట‌ని వీరు. అందుకు భిన్నంగా రాజ‌కీయ‌ప్ర‌యోజ‌నాల దృష్ట్యా మాత్ర‌మే సాయం చేస్తారా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

తాజాగా యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ చెల్లెలు ముచ్చ‌ట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్వ‌యంగా సీఎం చెల్లెలు అయిన ఆమె.. ఇప్ప‌టికీ టీ షాపు న‌డుపుతుంటారంటూ మీడియాలో ఉద‌ర‌గొట్టేస్తున్నారు. ఆ క్రెడిట్ అంతా యోగిదే అన్న‌ట్లుగా కొంద‌రు వార్త‌లు రాసిన వైనం చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.

నిజంగా క్రెడిట్ ఇస్తే యోగి సిస్ట‌ర్ కు ఇవ్వాలి. ఎందుకంటే.. త‌మ సోద‌రుడు సీఎం అయినా.. వారు త‌మ ప‌ని తాము చేసుకుంటున్నారేకానీ.. ఎక్క‌డా హెచ్చులు చెప్పుకోవ‌టం క‌నిపించ‌దు. వాస్తవ దృష్టితో చూస్తే..సొంత సోద‌రుడు రాష్ట్రానికి సీఎం అయినా త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌న్న కించిత్ బాధ‌.. ఆవేద‌న వారు వ్య‌క్తం చేయ‌క‌పోవ‌టం క‌నిపిస్తుంది. అంతేకాదు.. రాఖీ క‌ట్టించుకోవ‌టానికి కూడా గ‌డిచిన కొన్నేళ్లుగా రావ‌టం లేద‌న్న మాట‌ను ఆమె చెప్పారు.

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి యోగి సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న సోద‌రి మాత్రం ఉత్త‌రాఖండ్‌ లోని కోఠారి గ్రామంలో చిన్న టీ కొట్టు న‌డుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వైనం చూసిన‌ప్పుడు ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఇక‌.. ఆమె భ‌ర్త అక్క‌డే ఓ చిన్న పూజా సామాగ్రి దుకాణాన్ని నిర్వ‌హిస్తున్నారు.

త‌న అన్న సీఎం అయినా.. ఆ ద‌ర్ప‌మే ప్ర‌ద‌ర్శించ‌కుండా.. సాదాసీదా జీవితాన్ని గ‌డ‌ప‌ట‌మే కాదు.. చిన్న‌త‌నంలో స‌మాజానికి సేవ చేస్తాన‌ని చెప్పేవాడ‌ని.. ఇప్పుడు అదే ప‌ని చేస్తున్నాడ‌ని గ‌ర్వంగా చెప్పే ఆమె మాట‌లు..విన్న‌ప్పుడు యోగి కంటే ఆమె సోద‌రే గ్రేట్ అనిపించ‌క మాన‌దు. రాష్ట్రాన్ని బాగు చేసే ల‌క్ష్యంలో త‌ల‌మున‌క‌లైన యోగికి.. సోద‌రి ఇంటికి రాఖీ క‌ట్టించుకోవ‌టానికి దాదాపు రెండు ద‌శాబ్దాలుగా కుద‌ర‌క‌పోవ‌టం చూస్తే..యోగి క‌మిట్ మెంట్‌ను మెచ్చుకోవాలా?.. సోద‌రిని సైతం ప‌ట్టించుకోని సీఎం అన్న‌గా త‌ప్పు ప‌ట్టాలా?
Tags:    

Similar News