ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున దళితులు ఆందోళన నిర్వహించిన కొన్ని రోజుల్లోనే బీజేపీ ముఖ్యమంత్రిపై ఆ పార్టీ ఎంపీ చేసిన ఫిర్యాదు అంశం వెలుగు చూసింది. తనను దుర్భాషలాడుతూ బయటకు తోసేశారని బీజేపీకి చెందిన దళిత ఎంపీ చోటేలాల్ ఖార్వార్ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాయడం రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆదిత్యనాథ్ తో జరిగిన రెండు సమావేశాల్లో తనకు ఈ అవమానాలు ఎదురయ్యాయని ఖార్వార్ తన లేఖలో పేర్కొన్నారు.
ఖార్వార్ రాసిన లేఖలో బీజేపీ యూపీశాఖ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే, మరో నేత సునీల్ బన్సాల్‌పైనా ఆరోపణలున్నాయి. ఇదే విషయమై జాతీయ ఎస్సీ - ఎస్టీ కమిషన్ కు కూడా ఖార్వార్ ఫిర్యాదు చేశారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న అన్ని అవకాశాలు విఫలమైన తర్వాతే తాను కమిషన్‌కు ఫిర్యాదు చేశానని ఖార్వార్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 16న ప్రధానికి ఖార్వార్ రాసిన లేఖ పూర్తి పాఠాన్ని ఎన్ డీటీవీ బహిర్గతం చేసింది. ఈ లేఖతో యోగి ఇరకాటంలో పడిపోయారు. ఇప్పటికే ఎస్సీ -ఎస్టీలపై వేధింపులను నిరోధించే చట్టం విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాలకు నిరసనగా దళితులు నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా జరిగిన ఆందోళనల్లో పోలీసుల ప్రవర్తన కారణంగా అల్లర్లు చెలరేగడంతో ఇప్పటికే యోగి సర్కారు ఇబ్బందుల్లో ఉండగా...తాజా పరిణామం యోగిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.