యోగీ వ‌ర్సెస్ సిద్దూ!..తూటాలు పేలుతున్నాయ్‌!

Update: 2018-01-08 06:47 GMT
గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిశాయి. ఆ ఎన్నిక‌లు ముగిసేదాకా అంద‌రి దృష్టి ఆ రాష్ట్రంపైనే. అయితే అంతా ఊహించిన మాదిరే ఫ‌లితాలు రావ‌డం - ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సొంత రాష్ట్రంగా ఉన్న ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ‌తంలో కంటే మెరుగైన ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఉత్త‌రాదిలోని గుజ‌రాత్ నుంచి ద‌క్షిణాదిలోని క‌ర్ణాట‌క వైపు మ‌ళ్లింది. ఎందుకంటే... ఈ ఏడాది క‌ర్ణాట‌క అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సెమీ ఫైన‌ల్స్‌ గా భావిస్తున్నాయి. దీంతో ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌య‌మే ఉన్న‌ప్ప‌టికీ క‌న్న‌డ నాట అప్పుడే వేడి రాజుకుంది. క‌ర్ణాట‌క‌లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే అంత‌కుముందు అక్క‌డ బీజేపీ నేతృత్వంలో య‌డ్యూర‌ప్ప స‌ర్కారు పాల‌న సాగించిన సంగ‌తి కూడా తెలిసిన విష‌యమే. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చాటాల‌ని బీజేపీ చూస్తుండ‌గా - అధికారం నిల‌బెట్టుకుని బీజేపీకి షాకివ్వాల‌ని కాంగ్రెస్ కూడా యోచిస్తోంది. వెర‌సి క‌న్న‌డ నాట సైమీ ఫైన‌ల్స్‌ కు తెర లేచింద‌నే చెప్పాలి.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఎన్నిక‌ల్లో త‌మ‌ను ఢీకొట్టే స‌త్తా బీజేపీకి లేద‌ని వ్యాఖ్యానిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య ఎన్నిక‌ల ప్ర‌చారానికి అప్పుడే తెర తీసేశారు కూడా. అయితే బీజేపీ కూడా త‌క్కువేమీ తిన‌లేదు క‌దా. ఎన్నిక‌ల క్ర‌తువు ఇంకా మొద‌లు కాక‌ముందే త‌న అస్త్రాల‌ను క‌న్న‌డ నాట ప్ర‌యోగానికి గేట్లు ఎత్తేసింది. ఫ‌లితంగా త‌ర‌చూ అక్క‌డికి బీజేపీ సీనియ‌ర్లు వెళ్లి వ‌స్తుండ‌గా - ఇటీవ‌లే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కూడా క‌న్న‌డ రాజ‌కీయాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్న‌ట్లుగా బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో క‌ర‌డుగ‌ట్టిన హిందూత్వ వాదిగా, బీజేపీ అస‌లు సిస‌లు సిద్ధాంతాల‌ను అమ‌లు చేస్తున్న సీఎంగా పేరు గ‌డించిన ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ ఇప్పుడు కర్ణాట‌క బాట ప‌ట్టారు. నిన్న బెంగ‌ళూరులో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన యోగీ... నేరుగానే సిద్ధ‌రామ‌య్య‌పై విమ‌ర్శ‌నాస్త్రాల‌తో విరుచుకుపడ్డారు. అయితే ఎన్నిక‌ల స్టంటును అప్ప‌టికే ప్రారంభించేసిన సిద్దూ... కూడా యోగీ నోట నుంచి తూటాల్లాంటి మాట‌లు వెలువ‌డ‌గానే... మ‌రుక్ష‌ణ‌మే వాటికి ప్ర‌తిగా బాణాల్లాంటి విమ‌ర్శ‌ల‌ను సంధించేశారు. మొత్తంగా బీజేపీ - కాంగ్రెస్ ప్ర‌స్తావ‌న మాయం కాగా... యోగీ - సిద్ధూల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంద‌నే చెప్పాలి.

అయినా యోగీ ఏమ‌న్నారన్న విష‌యానికి వ‌స్తే... హిందువుగా ఉన్న సిద్ధ‌రామ‌య్య గోమాంసాన్ని ఎలా ప్రోత్స‌హిస్తార‌ని ప్ర‌శ్నించారు. అంతేకాకుండా ఓ హిందువుగా ఉన్న సిద్ధ‌రామ‌య్య‌.. గోమాంసాన్ని ఎందుకు నిషేధించ‌ర‌ని కూడా ప్ర‌శ్నించారు. హిందువున‌ని చెప్పుకుంటున్న సిద్ధ‌రామ‌య్య‌.. హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని త‌న‌దైన శైలిలో చెల‌రేగిపోయారు. ఈ వ్యాఖ్య‌లు త‌న చెవిన‌ప‌డ్డాయో, లేదో... వెనువెంట‌నే స్పందించేసిన సిద్ధ‌రామ‌య్య‌...  యోగీ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్లు ఇచ్చేశారు. *క‌ర్ణాట‌కకు వ‌చ్చి ఇక్క‌డి ఇందిరా క్యాంటీన్లు - రేష‌న్ షాపుల‌ను ప‌రిశీలించి వెళ్లండి. ఇవే ప‌థ‌కాల‌ను యూపీలో కూడా అమ‌లు చేస్తే.. అక్క‌డ ఆక‌లి చావులు ఉండ‌వు* అని కౌంట‌రిచ్చిన సిద్ధూ... యూపీలో మొన్నామ‌ధ్య చోటుచేసుకున్న ఆక‌లి చావుల‌ను ప్రస్తావిస్తూ యోగీకి ఘాటు కౌంట‌రే ఇచ్చారు.

సిధ్దూ వ్యాఖ్య‌లు చెవిన‌ప‌డ్డ వెంట‌నే యోగీ కూడా చాలా వేగంగా స్పందించారు. ‘‘మీ ఆహ్వానికి కృతజ్ఞతలు.. మీ హయాంలోనే కర్ణాటకలో రైతుల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని విన్నాను. అంతేకాదు నిజాయితీ పరులైన అధికారుల బదిలీలు - వారి మరణాలకు కూడా మీ ప్రభుత్వమే కారణమవుతుందంట కదా’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. మొత్తంగా ఓ రెండు - మూడు గంట‌ల వ్య‌వ‌ధిలోనే యోగీ - సిద్ధూల మ‌ధ్య ఇలా కౌంట‌ర్లు - ప్ర‌తి కౌంట‌ర్లు పేల‌డంతో నిజంగానే క‌ర్ణాట‌క‌లో అప్పుడే ఎన్నిక‌ల వేడి ప్రారంభమైపోయిందని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల క్ర‌తువు మొద‌లు కాకుండానే వీరిద్ద‌రి మ‌ధ్య ఇంత‌లా మాట‌లు తూటాల్లా పేలుతుంటే... ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లైతే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు.
Tags:    

Similar News