వాట్సాప్‌లో కొత్త ఫీచర్లొచ్చేస్తున్నాయ్..

Update: 2022-02-10 23:30 GMT
ఆ రోజుల్లో అయితే సమాచారం చేరవేయడం బహు కష్టం అన్నట్టుండేది.. ఎస్ఎంఎస్ వచ్చాక కొంత చక్కబడింది. ఆపై అనేక సౌలభ్యాలను అరచేతిలోకి తెస్తూ వాట్సాప్ వీర విహారం చేయసాగింది. ఇప్పుడంతా వాట్సాప్ దే హవా అనడంలో సందేహం లేదు. అంతలా చొచ్చుకుపోయింది. ఈ సామాజిక మాధ్యమం. ఇందుకుతగ్గట్లే ఫీచర్లలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ అదరగొడుతోంది.

తాజాగా మరికొన్ని ఆధునిక ఫీచర్లతో చెలరేగిపోనుంది.అత్యధిక డౌన్‌లోడ్‌లు కలిగిన ఏకైక మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌. మెసేజింగ్ నుంచి మనీ ట్రాన్స్‌ఫర్‌ వరకు ఎన్నో యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లు ఈ

యాప్‌లో ఉన్నాయి. గత కొంతకాలంగా వాట్సాప్‌ కొత్త ఫీచర్లను పరిచయం చేయడంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇతర యాప్‌లకు దీటుగా వరుస కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్స్‌ను ఆకర్షిస్తోంది. డేటా గోప్యతకు ఎన్‌క్రిప్షన్ భద్రత, డేటా స్టోరేజ్‌కు క్లౌడ్ సపోర్ట్‌ వంటి ఫీచర్లు ఉండటంతో అధికారిక సమాచార మార్పిడికి ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. మరి త్వరలో వాట్సాప్‌ యూజర్స్‌కు కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది.

1) డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌‌.. గతంలో మనం పంపిన మెసేజ్‌లో ఏదైనా తప్పు ఉంటే దాన్ని సరి చేసేందుకు అవకాశం ఉండేది కాదు. తప్పును
వివరిస్తూ మరో మెసేజ్‌ పంపాల్సిందే. దీంతో యూజర్స్ సమయం, డేటా, స్టోరేజ్ వృధా అయ్యేవి. ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగానే వాట్సాప్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌ను పరిచయం చేసింది. అంటే యూజర్‌ మెసేజ్‌ పంపిన తర్వాత నిర్ణీత కాల వ్యవధిలో వాటిని డిలీట్ చేస్తే అవతలి వ్యక్తి వాటిని చూడలేరు. గతంలో డిలీట్ మెసేజ్‌లో కాల పరిమితి 7 నిమిషాలు మాత్రమే ఉండేది. తర్వాత దాన్ని 1 గంట 8 నిమిషాలు 16 సెకన్లుకు పొడిగించారు. త్వరలో ఈ కాలపరిమితిని రెండు రోజుల 12 గంటలకు (రెండున్నర రోజులు) మార్చనున్నారు. అంటే మెసేజ్ పంపిన రెండున్నర రోజుల తర్వాత కూడా యూజర్స్ చాట్ పేజీల నుంచి డిలీట్ చేయొచ్చు.

2) గతేడాది ఫేస్‌బుక్ అనుబంధ సంస్థలు యూజర్ల నుంచి డేటా సేకరిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వాట్సాప్‌ కూడా డేటా సేకరిస్తుందనే సందేహాన్ని పలువురు యూజర్స్‌ వ్యక్తం చేశారు. అయితే వాట్సాప్‌లో యూజర్‌ డేటాకు ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుందని, యూజర్‌ మినహా దాన్ని ఎవరూ చూడలేరని వాట్సాప్ పేర్కొంది. దీంతో యూజర్లకు మరింత పారద్శ రక సేవలను అందించడం కోసం వాట్సాప్‌ రిక్వెస్ట్ రిపోర్ట్ ఫీచర్‌ను డెస్క్‌టాప్‌/వెబ్‌ వెర్షన్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ  ఫీచర్‌తో యూజర్స్‌ తమ ఖాతా లాగిన్ వివరాలు, ప్రైవసీ సెట్టింగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.

3) సైబర్‌ నేరగాళ్ల నుంచి యూజర్స్‌కు భద్రత కల్పించేందుకు సోషల్‌ మీడియా, మెయిల్ సేవలను అందించే సంస్థలు టూ-స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నాయి. తాజాగా వాట్సాప్‌ కూడా డెస్క్‌టాప్‌/వెబ్‌ వెర్షన్‌ యూజర్లకు టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ ఫీచర్ యాప్ వెర్షన్‌లో ఉంది. దీని కోసం సెట్టింగ్స్‌లో అకౌంట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుని ఉపయోగించవచ్చు. డెస్క్‌టాప్‌ యూజర్లకు పరీక్షల అనంతరం అందుబాటులోకి రానుంది.

4) వాట్సాప్‌ మెసేజ్ వచ్చిన వెంటనే ఫోన్ లాక్‌ స్క్రీన్‌ నోటిఫికేషన్‌ లేదా నోటిఫికేషన్ సెంటర్‌లో కనిపిస్తుంది. ఒకవేళ మెసేజ్ పంపిన వారి నంబర్‌ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉంటే పేరు కనిపిస్తుంది. అదే కొత్త నంబర్‌ నుంచి మెసేజ్ వస్తే ఎవరు పంపారో తెలుసుకునేందుకు మెసేజ్ ఓపెన్ చేయాల్సిందే. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ మెసేజ్ పంపిన వారి డీపీ/ప్రొఫైల్‌ ఫొటో నోటిఫికేషన్‌లో కనిపిస్తుంది. దాంతో నంబర్‌ సేవ్ చేసుకోకున్నా మెసేజ్‌ ఎవరు పంపారో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది.

5) వాట్సాప్ వినియోగాన్ని మరింత సులభతరం చేయడంలో భాగంగా యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)లో కూడా మార్పులు చేయనుంది. ఇందుకోసం వాట్సాప్‌ చాట్‌ విండోలోని చాట్ లిస్ట్‌ నుంచి బ్రాడ్‌కాస్ట్‌ లిస్ట్‌, న్యూ గ్రూప్‌ ఆప్షన్లను తొలగించి, న్యూ చాట్ ఆప్షన్‌లో చేర్చనుంది. ఈ ఫీచర్‌ అప్‌డేట్‌ తర్వాత యూజర్‌ న్యూ చాట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అందులో సెర్చ్‌బార్‌ పైన బ్రాడ్‌కాస్ట్‌ లిస్ట్‌, కింద న్యూ గ్రూప్ ఆప్షన్లు కనిపిస్తాయి. వాట్సాప్‌లో ఒకేసారి ఎక్కువ మందికి ఒకే మెసేజ్‌ పంపేదుకు బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌ను ఉపయోగించవచ్చు. ఒకే అభిప్రాయం కలిగినవారు చర్చించుకునేందుకు, అభిప్రాయాలు పంచుకునేందుకు గ్రూప్‌ క్రియేట్ చేసి అందులో సంభాషించవచ్చు.

6) యాపిల్ ఐమెసేజ్‌ తరహాలో వాట్సాప్ మరో ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. మెసేజ్‌ రియాక్షన్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచరతో యూజర్స్‌ వాట్సాప్ మెసేజ్‌లకు ఎమోజీ, స్టిక్కర్లతో రిప్లై ఇవ్వవచ్చు. దీనికి ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణ కూడా ఉంటుంది. ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక, యూజర్స్ మెసేజ్‌ మీద టచ్‌ చేస్తే ఎమోజీ రిప్లై ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో నచ్చిన ఎమోజీ లేదా స్టిక్కర్‌ను సెలెక్ట్ చేసి రిప్లై ఇవ్వవచ్చు.

7) ఇప్పటి వరకు ఐపాడ్‌లో వాట్సాప్ ఉపయోగించాలంటే వెబ్‌ వెర్షన్‌ మినహా మరో ఆప్షన్‌ లేదు. అయితే ఇందులో లాగిన్ కావాలంటే తప్పనిసరిగా మొబైల్‌ నుంచి డివైజ్‌ లింక్ చేయాల్సిందే. దీనికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్ ఐపాడ్ యాప్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇటీవలే దీనిపై వాట్సాప్ హెడ్ విల్‌ కాథ్‌కార్ట్ స్పష్టతనిచ్చారు. ఇందులో ఆండ్రాయిడ్ మొబైల్‌ యాప్ తరహాలో మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్‌ ఉంటుందని తెలిపారు.

8) వాట్సాప్ ఆడియో మెసేజ్‌లో రెండు కీలక అప్‌డేట్‌లను యూజర్లకు పరిచయం చేయనుంది. పాజ్‌-అండ్‌-రెజ్యూమ్‌/ప్లే (Pause-And-Resume/Play) పేరుతో తీసుకొస్తున్న ఫీచర్‌తో యూజర్స్ ఆడియో మెసేజ్‌ పంపేప్పుడు, రికార్డు చేసిన ఆడియోను విని అందులో ఏవైనా తప్పులుంటే దాన్ని డిలీట్ చేసి కొత్త ఆడియోను రికార్డు చేసి పంపొచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను యాప్‌, డెస్క్‌టాప్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ తీసుకొస్తున్న మరో ఆడియో అప్‌డేట్‌తో యూజర్స్ ఆడియో మెసేజ్‌ వింటూ యూజర్లతో చాట్ చేయొచ్చు. ప్రస్తుతం ఆడియో మెసేజ్ ప్లే చేసి మరో చాట్‌ విండో ఓపెన్ చేస్తే ఆడియో ఆగిపోతుంది. కానీ, కొత్త అప్‌డేట్‌తో ఆడియో ప్లే చేస్తే వేరే యూజర్‌ చాట్ పేజ్ ఓపెన్ చేస్తే ఆడియో ఆగిపోకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో
వినిపిస్తుంది.
Tags:    

Similar News