ఆ సీఎంను, ఆయ‌న కుమారుడిని మీరు బ్ర‌ద‌ర్సా అని అడుగుతున్నార‌ట‌!

Update: 2022-08-22 09:31 GMT
త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం (డీఎంకే) పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ఒక కుమారుడు ఉద‌యనిధి స్టాలిన్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం డీఎంకే ఎమ్మెల్యేగా కూడా ఉన్న ఉద‌య‌నిధి స్టాలిన్ సినిమాల్లోనూ హీరోగా న‌టిస్తున్నారు. కాగా తండ్రీకొడుకుల మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్ద‌రూ తండ్రీకొడుకుల కంటే కూడా స్నేహితుల్లానే క‌నిపిస్తుంటారని చెబుతుంటారు. స్టాలిన్ ను క‌ల‌వ‌డానికి ఎవ‌రైనా వ‌చ్చిన‌ప్పుడు అక్క‌డ ఉద‌య‌నిధి స్టాలిన్ కూడా ఉంటారు.

ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి స్టాలిన్ వ‌ద్ద ఉద‌య‌నిధి స్టాలిన్ ను చూసి ఈయ‌న మీ సోద‌రుడా అని అడుగుతున్నార‌ట‌. అలాగే స్టాలిన్ త‌న కుమారుడితో విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఈ ప్ర‌శ్న ఇంకా ఎక్కువ‌గా వ‌చ్చేద‌ట‌. తాను గొప్పలు చెప్పుకోవ‌డం లేద‌ని.. విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు చాలామంది త‌న‌ను ఇదే ప్ర‌శ్న అడిగేవార‌న్నారు. త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై ఎలియ‌ట్ బీచ్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ స్టాలిన్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

త‌న వ‌య‌సు 70 ఏళ్లు అని.. తాను ఆరోగ్యంగా ఉండ‌టానికి రోజూ ఐదు కిలోమీట‌ర్లు న‌డుస్తాన‌ని.. అలాగే గంట‌పాటు వ్యాయామం చేస్తాన‌ని తెలిపారు. యోగా కూడా చేస్తాన‌న్నారు. ఇలా వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా త‌న శ‌రీరం గురించి జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే ఉంటాన‌ని చెప్పారు.

దాన్ని బాధ్య‌త‌గా భావించి ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెడుతుంటాన‌ని వెల్ల‌డించారు. అయితే ముఖ్య‌మంత్రిగా ప‌ని ఒత్తిడితో నిత్యం చేయ‌లేక‌పోతున్నా అని తెలిపారు. స‌మ‌యం దొరికితే మాత్రం వ్యాయామం, యోగా చేస్తూనే ఉంటాన‌ని వెల్ల‌డించారు.

ఇటీవల తాను కరోనా వైరస్‌ బారినపడినా త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి తాను ఆరోగ్యంపై తీసుకుంటున్న శ్ర‌ద్ధే కార‌ణ‌మ‌ని స్టాలిన్ తెలిపారు. క‌రోనా త‌న‌ను తీవ్రంగా వేధించక‌పోవ‌డానికే ఆరోగ్య నియ‌మాలు చ‌క్క‌గా పాటించ‌డ‌మే కార‌ణ‌మ‌ని చెప్పారు.

ఆరోగ్య నియమాలను పాటించడం వల్లే క‌రోనా త‌న‌పై తీవ్ర ప్రభావం చూపలేదని.. ఇదే విషయాన్ని వైద్యులు కూడా తెలిపార‌ని స్టాలిన్ చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాల‌న్నారు.  ఈ సందర్భంగా చెన్నై బీచ్‌లో స్టాలిన్ కొద్దిసేపు బాస్కెట్‌బాల్‌, షటిల్ ఆడి అల‌రించారు.
Tags:    

Similar News