'హిజాబ్' ముస్కాన్ కు అల్ ఖయిదా చీఫ్ ఏమన్నాడో తెలిస్తే షాకే

Update: 2022-04-07 04:17 GMT
ఏ చిన్న అవకాశం లభించినా.. దేశంలో శాంతిభద్రతల సమస్యల్ని తెచ్చి పెట్టేందుకు విదేశీ శక్తులు ఎంతలా పొంచి ఉన్నాయో చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పాలి. మతమా? దేశమా? అన్నప్పుడు దేశ పౌరులు ఎవరైనా దేశమనే మాటే నోటి నుంచి.. మనసు నుంచి రావాలి. అందుకు భిన్నంగా నోటి నుంచి ఒకలా.. మనసు నుంచి మరోలాంటి మాటలు వస్తే మాత్రం దేశ సమగ్రతకే సమస్యగా మారటం ఖాయం. విద్యాసంస్థల్లో బురఖా వద్దని.. అందరూ ఒకేలా ఉండాలన్న వాదనకు భిన్నంగా మత విశ్వాసాల్ని చదువుల తల్లి ఒడిలో చూపించే ప్రయత్నం చేసిన కర్ణాటక విద్యార్థిని ముస్కాన్ గుర్తుంది కదా?

జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్న వారి ఎదురు నిలబడి.. అల్లాహు అక్బర్ అంటూ నినదించిన ఆమె తీరు.. కొత్త రచ్చకు తెర తీయటమే కాదు.. హిజాబ్ ఉదంతంపై ఎంత లొల్లి నడిచిందో తెలిసిందే. ఇదిలా ఉంటే.. ముస్కాన్ వీడియోను.. ఫోటోల్ని చూసిన అల్ ఖైదా అధినేత జవహరీ తాజాగా రియాక్టు కావటం సంచలనంగా మారింది.

తాజాగా ముస్కాన్ తీరుపై ఆయన తొమ్మిది నిమిషాల వీడియోను విడుదల చేశారు. అందులో.. విద్యార్థిని ముస్కాన్ ను అభినందిస్తూ జవహరీ పలు వ్యాఖ్యలు చేశారు. ఆమెను సోదరిగా అభివర్ణించిన ఆయన.. 'ది నోబెల్ ఉమెన్ ఆఫ్ ది ఇండియా'గా అభివర్ణించారు. ఆమె జిహాద్ స్ఫూర్తిని కొనసాగించినట్లుగా పేర్కొన్నారు.

భారతదేశంలో ముస్లింలపై ప్రభుత్వం దమనకాండ ప్రయోగిస్తుందని.. దీన్ని తప్పి కొట్టేందుకు వీలుగా దేశంలోని ముస్లింలు అంతా యుద్ధం చేయాలని పిలుపునివ్వటం గమనార్హం. అంతేకాదు.. ఇంటలెక్చువల్ గా మీడియాను ఉపయోగించుకోవాలన్న సలహాను ఇచ్చిన అతను.. ఆయుధాలతోనూ యుద్ధ రంగంలోని దిగాలని పిలుపునివ్వటం ఆందోళనను కలిగించే అంశంగా చెప్పాలి.

బహు దైవారాధకులకు.. ముస్లింలకు నడుమ శత్రుత్వాన్నిముస్కాన్ బయటపెట్టిందన్న ఆయన.. భారత్ లోని మోసపూరిత అన్యమత ప్రజాస్వామ్యాన్ని వెలుగులోకి తెచ్చినందుకు దేవుడు ఆమెకు తగిన ప్రతిఫలం ఇవ్వుగాక అని పేర్కొన్నారు. అతివాదికి.. అమాయక ప్రాణాలు తీసే జవహరీ లాంటి వాడికి ముస్కాన్ మాటలు నచ్చాయంటే.. ఆమె ఎంత రాంగ్ ట్రాక్ లో నడుస్తుందన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిదని చెబుతున్నారు.

అంతేకాదు.. ఆమె మీద తానొక పద్యం రాశానని.. ఆమె తనకు ప్రేరణ కలిగించినట్లుగా పేర్కొన్నారు. తన బహుమతిగా ఆ పద్యాన్ని ఆమె స్వీకరిస్తుందని పేర్కొన్నారు. జవహరీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముస్లిం సంస్థలు ఈ తీరును ఖండించాల్సిన తీరు ఉందంటున్నారు. మరోవైపు.. తాజా పరిణామాలతో ముస్కాన్ తండ్రిని మీడియా ప్రశ్నించగా.. అతడెవరో తెలీదని.. తనకు తెలియని ఉర్దూలో ఏదో మాట్లాడారన్నారు.

ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని.. తమకు ఎవరి సాయం వద్దన్నారు. 'మనమంతా ఈ దేశంలో శాంతియుతంగా జీవిస్తున్నాం. మనలో విభేదాల్ని తీసుకొచ్చే ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు. ఈ మాటల్ని ముస్కాన్ తండ్రి కంటే ఆమెనే చెబితే బాగుంటుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News