సైనికాధికారిని కిడ్నాప్ చేసి మ‌రీ చంపేశారు

Update: 2017-05-11 04:48 GMT
అంత‌కంత‌కూ దిగ‌జారుతున్న శాంతిభ‌ద్ర‌త‌ల‌తో జ‌మ్మూక‌శ్మీర్ ఇప్పుడో ఆందోళ‌న‌క‌ర అంశంగా మారింది. మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా.. కశ్మీరీ యువ‌కుల్ని ఉగ్ర‌వాదులు కిడ్నాప్ చేసినా.. వారికి వార్నింగ్ ఇచ్చేసి వ‌దిలేస్తుంటారు. దీనికి భిన్న‌మైన ఉదంతం తొలిసారి చోటు చేసుకుంది. క‌శ్మీర్ లోయ‌కు చెందిన ఒక యువ సైనికాధికారిని కిడ్నాప్ చేసిన ఉగ్ర‌వాదులు.. అత‌న్ని చంపేయ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

క‌శ్మీర్ లోని కుల్గాం జిల్లా సుర్సోనా గ్రామానికి చెందిన 22 ఏళ్ల ఉమ‌ర్ ఫ‌యాజ్ లెఫ్టెనెంట్ గా చేరారు. గ‌త డిసెంబ‌రులో రాజ్ పుతానా రైఫిల్స్ రెజిమెంట్ లో చేరిన ఈ యువ సైనికాధికారి తొలిసారి సెల‌వుల‌పైన ఇంటికి వెళ్లాడు. త‌న మేన‌మామ కుమార్తె పెళ్లికి హాజ‌ర‌య్యేందుకు సెల‌వు తీసుకున్నాడు. అదే అత‌గాడి ప్రాణాల్ని తీసేలా చేసింది.
పెళ్లికి వెళ్లిన అత‌న్ని ముసుగులు ధ‌రించిన ఇద్ద‌రు కిడ్నాప్ చేశారు.  తాము ఫ‌యాజ్ ను తీసుకెళుతున్న విష‌యాన్ని ఎవ‌రికీ చెప్పొద్ద‌ని తీవ్ర‌వాదులు హెచ్చ‌రించారు. గ‌తంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌టం.. కిడ్నాప్ అనంత‌రం వార్నింగ్ ఇచ్చేసి వ‌దిలేయ‌టం క‌శ్మీరీ లోయ‌లో మామూలే. దీంతో.. ఈసారీ అలానే జ‌రుగుతుంద‌ని భావించిన ఫ‌యిజ్ బంధువులు సైనిక అధికారుల‌కు.. పోలీసుల‌కు కిడ్నాప్ స‌మాచారాన్ని అందించ‌లేదు.

అనూహ్యంగా అత‌డి మృత‌దేహం  ఫ‌యిజ్ ఇంటికి మూడు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హ‌ర్మేన్ ప్రాంతంలో  ప‌డేసిన వైనాన్ని గుర్తించారు. అత‌డి త‌ల‌.. ఛాతీ.. పొట్ట భాగంలో తూటా గాయాలు ఉన్న‌ట్లుగా గుర్తించారు. క‌శ్మీర్ కు చెందిన ఒక యువ సైనికాధికారిని ఇలా హ‌త్య చేయ‌టం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. యువ సైనికాధికారి హ‌త్య‌ను పిరికిపంద‌ల చ‌ర్య‌గా కేంద్ర ర‌క్ష‌ణ శాఖామంత్రి అరుణ్ జైట్లీ అభివ‌ర్ణించారు. యువ సైనికాధికారి హ‌త్య కాశ్మీరీ లోయ‌లో కొత్త సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News