దూసుకుపోతున్న యువ ఎమ్మెల్యేలు..!

Update: 2022-01-08 13:30 GMT
తెలంగాణ రాష్ట్ర స‌మితికి చెందిన యువ ఎమ్మెల్యేలు అభివృద్ధిలో దూసుకు పోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. మ‌రోసారి నియోజ‌క‌వ‌ర్గంలో గులాబీ జెండా ఎగుర‌వేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. పార్టీ ప‌నుల‌తో పాటు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల మెప్పు పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వినూత్న కార్య‌క్ర‌మాల‌తో పార్టీ పెద్ద‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు.
ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాకు చెందిన న‌లుగురు యువ‌ ఎమ్మెల్యేలు ఈ విష‌యంలో ముందు వ‌రుస‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. పైగా వీరంతా మొద‌టిసారి అసెంబ్లీకి ఎన్నిక‌వ‌డం గ‌మ‌నార్హం. కొడంగ‌ల్ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ ఆనంద్, ప‌రిగి ఎమ్మెల్యే కొప్పుల మ‌హేష్ రెడ్డి ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. నిత్యం నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్నారు.

కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డిని కొడంగ‌ల్‌లో ఓడించి సంచ‌ల‌నం సృష్టించిన న‌రేంద‌ర్ రెడ్డి త‌న విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌క కాద‌ని నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎన్నికల నాటి నుంచి క్ష‌ణం తీరిక లేకుండా నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు తీర్చేందుకు కృషి చేస్తున్నారు. ప‌లు అభివృద్ధి ప‌నులు కూడా పూర్తి చేయించారు. నియోజ‌క‌వ‌ర్గం రెండు జిల్లాల ప‌రిధిలో ఉండ‌డంతో ప‌లు స‌మ‌స్య‌ల‌పై అధికారుల‌తో మాట్లాడి స‌మ‌న్వ‌యం చేస్తున్నారు. మ‌రోసారి ఇక్క‌డి నుంచి గులాబీ జెండాను ఎగ‌ర‌వేయాల‌ని సంక‌ల్పించుకున్నారు.

ప‌రిగి ఎమ్మెల్యే కొప్పుల మ‌హేష్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప‌ని తాను ప్ర‌శాంతంగా చేసుకుపోతున్నారు. హంగు ఆర్భాటాలు లేకుండా ప్ర‌జ‌ల్లో ఒక‌డిగా మెలుగుతున్నారు. త‌న తండ్రి హ‌రీశ్ రెడ్డి రాజ‌కీయాల‌ను పుణికిపుచ్చుకున్న మ‌హేష్ త‌న తండ్రి బాట‌లోనే ముందుకు సాగుతున్నారు. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీరుస్తూ రోజులో ఇర‌వై గంట‌లు అహ‌ర్నిశ‌లు ప‌నిచేస్తున్నారు. ప్ర‌తిప‌క్షాలు కూడా విమ‌ర్శించ‌లేని విధంగా ప‌రిగిలో పాల‌న సాగిస్తున్నారు. మ‌రోసారి నియోజ‌క‌వ‌ర్గంలో గులాబీ జెండా ఎగుర‌వేసి కేసీఆర్ మెప్పు పొందాల‌ని భావిస్తున్నారు.

ఈ న‌లుగురు ఎమ్మెల్యేల‌లో అత్యంత చురుకుగా ఉన్న‌ది వికారాబాద్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ మెతుకు ఆనందే. ప్ర‌తి రోజు క్యాంపు కార్యాల‌యంలో స్థానికంగా ఉంటూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీరుస్తున్నారు. రోజూ నియోజ‌క‌వ‌ర్గంలో ఏదో ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొంటూ కొన్ని స‌మ‌స్య‌ల‌ను అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్కరిస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్ర‌తి రోజూ ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల్లో పాద‌యాత్ర‌లు చేస్తూ ప్ర‌జ‌ల మ‌న‌సు చూర‌గొంటున్నారు. ప్ర‌జ‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ఎవ‌రినీ నొప్పించ‌కుండా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ అధిష్ఠానం ఈ న‌లుగురు యువ ఎమ్మెల్యేల ఉత్సాహం చూసి  మిగ‌తా ఎమ్మెల్యేలు కూడా వీరి బాట‌లోనే సాగాల‌ని ఆదేశించింద‌ట‌. వీరి ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు విజ‌య‌వంత‌మ‌వుతుందో వేచి చూడాలి.
Tags:    

Similar News