'గిల్లు'కుని చూడు.. ప్రతిభకు న్యాయం చేస్తున్నావా? అభిమానుల ట్రోల్స్ లో యువ ఓపెనర్

Update: 2022-12-14 11:30 GMT
ఓ పక్క కెప్టెన్ రోహిత్ శర్మ.. మరోపక్క వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఇప్పటికే టెస్టులాడిన మయాంక్ అగర్వాల్.. చోటుకోసం చకోర పక్షిలా ప్రథ్వీ షా.. నేనూ ఉన్నానంటున్న అభిమన్యు ఈశ్వరన్.. ఇదీ టీమిండియా టెస్టు జట్టు ఓపెనింగ్ కు ఉన్న పోటీ. వీటిన్నిటి మధ్య కూడా ఓ ఆటగాడికి చోటు దక్కుతోంది. అతడే శుబ్ మన్ గిల్. 23 ఏళ్ల గిల్ కు లక్ వెంట వస్తోంది. 2018 ప్రపంచ కప్ గెలిచిన అండర్ 19 జట్టుకు అతడు వైస్ కెప్టెన్. నాటి కెప్టెన్ షా. మరుసటి ఏడాదే అతడు టీమిండియాలోకి వచ్చాడు. కానీ బ్యాడ్ లక్ వెంటాడింది. ఆస్ట్రేలియా సిరీస్ కు ముందు గాయంతో వెనుకబడ్డాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోయాడు. చివరకు టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాడు. సెలక్టర్లనూ విమర్శిస్తున్నాడు. అతడితో పోలిస్తే గిల్ కాస్త వెనక వచ్చాడు. కానీ, షా అంత దూకుడుగా బ్యాటింగ్ చేయలేకపోయినా.. లక్ అతడి వెంట నడుస్తోంది. కానీ, గిల్ దానికి న్యాయం చేయడం లేదనిపిస్తోంది.

అవకాశాలు అందివస్తే.. ఓపెనర్ కాబట్టే టీమిండియాలో గిల్ కు ఇన్ని అవకాశాలు వస్తున్నాయి. వాస్తవానికి అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రెగ్యులర్ ఓపెనర్ కాదు. కానీ, అంతర్జాతీయ క్రికెట్ లో ఓపెనింగ్ చేస్తూ ఫర్వాలేదనిపించాడు. మధ్యలో మరే యువ క్రికెటర్ కూడా పోటీకి రాకపోవడం గిల్ కు కాలం కలిసివచ్చింది. టీమిండియాలో చోటు దక్కాలంటే రాసి పెట్టి ఉండాలి. అద్భుతమైన టెక్నిక్, ఎలాంటి పరిస్థితిలో అయినా ఆడే సత్తా ఉన్న ఆటగాళ్లకు కూడా చాన్స్ లు వస్తాయన్న నమ్మకం ఉండదు. కానీ, గిల్ కు అదేమీ ఇబ్బంది కాలేదు. అయితే, అతడు మంచి ఇన్నింగ్స్‌లు ఆడి జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు.

ఈశ్వరన్ ను కాదని.. బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ తో ఓపెనింగ్ స్థానానికి గిల్ కు పోటీ ఏర్పడింది. అభిమన్యు ఇండియా -ఎ తరఫున బంగ్లాదేశ్ ఎ జట్టుతో జరిగిన మ్యాచ్ లో వరుసగా రెండు సెంచరీలు కొట్టాడు. కానీ, కాస్త అనుభవం ఉండడంతో తొలి టెస్టులో గిల్ ను తీసుకున్నారు. అయితే, బుధవారం ఆరంభమైన మ్యాచ్ లో అతడు విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ ను బాగానే ప్రారంభించినా.. భారీ ఇన్నింగ్స్ గా మలచలేకపోయాడు. కాగా, ఓపెనర్‌గా గిల్ ఇప్పటివరకు టెస్టు శతకం చేయలేకపోయాడు. గతేడాది ఐపీఎల్ వరకు అతడిని పరిమిత ఓవర్ల క్రికెట్‌ కోసం పరిగణనలోకి తీసుకోలేదు. కానీ ఐపీఎల్‌లో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లతో వన్డే జట్టులోకి వచ్చాడు. జింబాబ్వే, వెస్టిండీస్ పర్యటన్లలో ఫర్వాలేదనిపించాడు. తొలి శతకం కూడా నమోదు చేశాడు. ఇదే ఊపులో బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టులోకి  తీసుకున్నారు. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. అనవసర షాట్‌కు ప్రయత్నించి స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. తైజుల్ ఇస్లామ్ వేసిన బంతిని ప్యాడిల్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతిని సరిగా అంచనా వేయలేకపోవడంతో అది ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. స్లిప్స్‌లో ఉన్న ఫీల్డర్ దాన్ని చక్కగా అందుకోవడంతో గిల్ ఇన్నింగ్స్ (40 బంతుల్లో 20, 2 ఫోర్లు) ముగిసింది.

ఫ్యాన్స్ ఆగ్రహం.. గిల్ అవకాశాలను వృధా చేసుకోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని చాన్సులు ఎవడైనా వేస్ట్ చేసుకుంటాడా? అని అడుగుతున్నారు. గబ్బాలో ఆస్ట్రేలియాపై చేసిన 94 పరుగుల ఇన్నింగ్స్ తప్ప మిగతా అన్ని మ్యాచుల్లోనూ ఇలా చెత్త షాట్లతో అనవసరంగానే గిల్ అవుట్ అవుతున్నాడని మండి పడుతున్నారు. అతని బదులు అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడించి ఉండాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. మరి గిల్ రెండో ఇన్నింగ్స్‌లో అయినా తనపై వస్తున్న విమర్శలకు బ్యాటుతో బదులిస్తాడేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News