నేను.. నా ఫోన్.. నా ఆత్మహత్య... !

Update: 2017-11-28 17:30 GMT
‘నేను - నా సెల్ఫోన్ - ఫేస్ బుక్ లేదా మరేదైనా సామాజిక మాధ్యమం. ఇదే నా లోకం. ఇంతకు మించి నాకు ఏమీ తేలీదు. నిరంతరం ఫోన్ పైనే నా దృష్టి. నా వేళ్లన్ని ఫోన్ కీ బోర్డుపైనే కదులుతుంటాయి. నా కళ్లు స్క్రీన్ వైపే కేంద్రీకరించి తల ఎప్పుడూ వంగే ఉంటుంది. చివరకు నేను ఏమీ చేస్తున్నానో నాకే తెలియదు. మానసిక సమస్యల ఫలితంగా ఆత్మహత్యనే నాకు శరణ్యం’ ఇదేమిటని ఆశ్యర్యపోతున్నారా? ఇది నిజం. అక్షరాల వాస్తవం. సమాజాన్ని కుదిపేస్తున్న ప్రధాన సమస్య. ఇది అమెరికాలో కౌమరదశలో ఉన్నవారి అత్యధికులలో నెలకొన్న పరిస్థితి.

ఓవైపు అమెరికా సమాజం ఆదర్శంగా అందరికీ కనిపిస్తుంటే - మరీ ముఖ్యంగా భారత్ యువ సమాజం పశ్చిమం వైపు పరుగు పెడుతుంటే - అక్కడేమో యువకులు విపరీత ధోరణిలో ఆత్మహత్యలు చేసుకోవడం పెరిగిపోతోంది. అమెరికా సమాజంలో యువకులు ముఖ్యంగా కౌమార దశలో ఉన్నవారు తీవ్ర ఆందోళన - ఒత్తిళ్లకు గురవుతూ ఆత్మహత్యకు సునాయాసంగా పాల్పడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. అందుకు సెల్ ఫోన్ల వినియోగం పెరగటంతో పాటు సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్ - ఇన్ స్టాగ్రామ్ - స్నాప్ చాట్ మొదలైన వాటిని అత్యధికంగా వినియోగిస్తుంటమే కారణమని తాజా అధ్యయనంలో తేలింది. ప్రధానంగా అమెరికా యువతలో ఐఫోన్ వినియోగం ఎక్కువగా ఉంటోంది.

పాఠశాల విద్యార్థులు సైతం ఐఫోన్ లేకుండా తమ చదువు సాగించలేని పరిస్థితి నెలకొంది. ఈ స్మార్ట్ ఫోన్ల కారణంగా సామాజిక మాధ్యమాలపై సమయం ఎక్కువ వెచ్చిస్తూ క్రమంగా జీవితానికి దూరమై ఒత్తిడికి లోనవుతూ ఆత్మహత్యలకు పాల్పడటం గత ఎనిమిదేళ్లలో 31 శాతం పెరిగిందని తాజా అధ్యయనంలో తేలినట్లు ప్రముఖ పత్రిక ది ఎకనమిస్ట్ వెల్లడించింది. పాఠశాలల్లో ప్రతి ఒక్కరు ఫోన్ను వినియోగించటం - అత్యధిక సమయం దానిపైనే వెచ్చించటం సహజంగా మారిపోయింది. ప్రతి ఒక్కరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దాని స్క్రీన్ పై రెండు కళ్లు కేంద్రీకృతమై ఉంటాయి. తల వొంచి చూస్తుంటారు. రెండు చేతి వేళ్లూ ఫోన్ కీబోర్డ్ పై పనిచేస్తుంటాయి. అందులోనూ యూట్యూబ్ - ఇన్ స్టాగ్రామ్ - ఫేస్ బుక్ ఎక్కువగా వినియోగిస్తుంటారు.

ఐఫోన్ ఉత్పత్తి ప్రారంభమైన 2007 సంవత్సరం నుంచి అమెరికాలో ఈ సంస్కృతి పెరిగిపోయినట్లు ఆ దేశానికి చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ తన అధ్యయనంలో వెల్లడించినట్లు ది ఎకనమిస్ట్ పేర్కొంది. ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ పరిశీలనలో ప్రతి విద్యార్థి రోజుకు 150 సార్లు పరిశీలిస్తున్నట్లు లెక్కగట్టారు. గత దశాబ్ద కాలంలో ఈ విపరీతమైన పోకడల వల్ల పిల్లలు ముఖ్యంగా కౌమారదశలో ఉన్నవారు మానసిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి చావుబతుకుల మధ్య ఆసుపత్రికి చేరటం రెండింతలు పెరిగింది. వారికి కుటుంబం - స్నేహితులు - సమాజం - చదువు - ఆటపాటలపై శ్రద్ద తగ్గిపోయి ఫోన్ కు అంకితం కావటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని సైకో థెరపిస్టు పేర్కొంటున్నట్లు ఎకనమిస్ట్ వెల్లడించింది. ఈ సమస్య 15 నుంచి 19 ఏళ్లలోపు పిల్లల మధ్య అధికంగా ఉంటుండగా, ముఖ్యంగా బాలికల్లో మరింత ఎక్కువగా ఉంటోంది. దీనిపై కాలిఫోర్నియాలోని ఫిజియాలజీ సర్వీసెస్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నికోలే గ్రీన్ మరింత లోతుగా అధ్యయనం చేసి అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారని ఎకనమిస్ట్ పేర్కొంది.

రోజులో అత్యధిక సమయం విద్యార్థులు సెల్ ఫోన్ తోపాటు సామాజిక మాధ్యమాలకు అంకితమవుతున్నారు. ముఖ్యంగా బాలికలు ఇదే పనిలో ఉంటున్నారు. మొత్తం ఐదు లక్షల మంది బాల-బాలికలపై అధ్యయనం చేయగా వారిలో కౌమార దశలో ఉన్నవారు స్నాప్ చాట్ - ఫేస్ బుక్ - ఇన్ స్టాగ్రామ్ లను స్మార్ట్ ఫోన్లలోనే వినియోగిస్తున్నట్లు టివింగే అనే అధ్యయనవేత్త వెల్లడించింది. తద్వారా వారు ఎటువంటి పనులు చయలేకపోతున్నారు. విద్యపై దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారు. తమకు భవిష్యత్తు లేదంటూ అంధకారంగా భావించి మానసిక ఒత్తిడికి లోనై రోగాల బారిన పడుతున్నారు. తద్వారా వింతగా ప్రవర్తిస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. లేదా ఆత్మహత్యకు సిద్ధమవుతున్నారు. దీనిపై టివింగే 2016లో సాగించిన అధ్యయనంలో సామాజిక మాధ్యమాలు - సెల్ ఫోన్ల వినియోగం లేకుండా జీవనం సాగించలేరా అని ప్రశ్నించగా అత్యధికులు తమకు అవి అనివార్యమని - అవి లేకపోతే తాము లేమని తేల్చిచెప్పారు. మరికొందరు సెల్ ఫోన్ - సామాజిక మాధ్యమాలను దూరం పెట్టి ఇతరత్రా పనులపై దృష్టి కేంద్రీకరించటం ద్వారా జీవన పరిస్థితులను మెరుగుపరుచుకున్నారు.

2013 నుంచి 2016 వరకు అటువంటి రెండు రకాల విద్యార్థులపై పరిశోధన సాగింది. తమ వృత్తి లేదా చదువులో భాగంగా లేక అధ్యయనం కోసమో సామాజిక మాధ్యమాలను - సెల్ ఫోన్లను వినియోగించటం కాకుండా ఇతర ప్రాంతాలను అప్రాధాన్యత కలిగిన వాటిని విస్తృతంగా ప్రచారం - ప్రసారం చేయడానికి, లేదా ఆసక్తిగా తెలుసుకునేందుకు ఎక్కువ సమయాన్ని అత్యధికులు ఐఫోన్పై పనిచేస్తున్నారు. అలా కాకుండా చదువు - ఆటపాటలు - క్రీడలపై ఎంతో కొంత సమయాన్ని వెచ్చిస్తూ నలుగురితో కలిసి తిరుగుతూ కుటుంబంలో అందరితోనూ సంబంధాలు కొనసాగిస్తున్న వారి పరిస్థితి మెరుగ్గా ఉంటోంది.

మరోవైపు సెల్ ఫోన్లు - సామాజిక మాధ్యమాల వల్ల ప్రతి పనిలోనూ ముఖ్యంగా వివిధ సమావేశాలు - ఫంక్షన్లు - మొదలైన వాటిలో పాల్గొన్నప్పుడు వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం వల్ల జీవితంలో ఖర్చు కూడా పెరిగిపోతున్నట్లు గుర్తించారు. ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కోసం ఫంక్షన్లలో ఎక్కువ మొత్తాలు ఖర్చు చేయాల్సి వస్తోందని అధ్యయనంలో తేలింది. మొత్తానికి అమెరికా సమాజం ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కొంటుండగా మనవాళ్లందరూ ఆ దేశాన్నే ఆదర్శంగా తీసుకుని అర్రులుచాస్తున్నారు.


------ఎస్ . వి. రావు
Tags:    

Similar News