ఫేక్ న్యూస్ పై యూట్యూబ్ వార్..భారీ పెట్టుబ‌డి!

Update: 2018-07-11 01:30 GMT
ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా వాడ‌కం పెరిగిపోయిన నేప‌థ్యంలో .....ఏది ఫేక్ న్యూస్? ఏది రియ‌ల్ న్యూస్ అనేది తెలుసుకోవ‌డం క‌ష్ట‌త‌ర‌మైన విష‌యం తెలిసిందే. పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేసే ముఠాలు సంచ‌రిస్తున్నాయంటూ....వాట్సాప్ లో స‌ర్క్యులేట్ అయిన వ‌దంతుల నేప‌థ్యంలో ....చాలా మంది అమాయ‌కులు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో , ఫేక్ న్యూస్ అరిక‌ట్టేందుకు కేంద్రం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందులో భాగంగానే  సైబర్‌ నేరాలు - సోషల్‌ మీడియాలో వదంతులు - నకిలీ వార్తల సమాచారం పై హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో ఓ ప్యానెల్ ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దాంతో పాటు - త‌ప్పుడు వార్త‌లు విస్త‌రించ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని వాట్సాప్ ను కేంద్రం ఆదేశించింది. ఈ నేప‌థ్యంలోనే ఫేక్ న్యూస్ ల‌ను గుర్తించేందుకు 171 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు యూట్యూబ్ సంస్థ ప్ర‌క‌టించింది.

ఈ త‌ర‌హా ఫేక్ న్యూస్ ల‌ను అరిక‌ట్టేందుకు గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ ను గూగుల్ సంస్థ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా యూట్యూబ్ ....25 మిలియ‌న్ డాల‌ర్ల‌ను ఫేక్ న్యూస్ అరిక‌ట్టేందుకు పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది. ఫేక్ న్యూస్ ల‌ను గుర్తించేందుకు త్వ‌ర‌లో కొత్త ఫీచ‌ర్స్ ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. కాగా, వార్త‌ల నిజ‌నిర్ధార‌ణ కోసం వీలుగా జ‌ర్న‌లిస్టుల‌కు ఓ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని గూగుల్ నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. దేశవ్యాప్తంగా దాదాపు 8000 మంది జ‌ర్న‌లిస్టుల‌కు శిక్ష‌ణనిచ్చేందుకు గూగుల్ స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు గాను మందుగా 200 మంది జర్న‌లిస్టుల‌ను ఎంచుకొని వారంద‌రికీ ఇంగ్లిషు - తెలుగుతో పాటు 5 ప్రాంతీయ భాష‌ల్లో శిక్ష‌ణ ఇవ్వ‌నుంది.


Tags:    

Similar News