రాజకీయ నాయకులంటేనే అదో రకమైన భావన. అందరూ అని కాదు మెజార్టీ నేతలు ముందు ఒక మాట, వెనుక మరోమాట. చెప్పిన మాటను చెప్పలేదని దాటవేయడం, అంతా మీడియా సృష్టి అని తప్పించుకోవడం వారికి ఆనవాయితి. అయితే టెక్నాలజీ పుణ్యాన వారి పప్పులు ఉడకడం లేదు సరికదా కొత్త తిప్పలు మొదలవుతున్నాయి. ఎంతగా అంటే మాట మార్చిన వెంటనే గతంలో సదరు నాయకుడు చెప్పిన మాటల తాలూకు వీడియో రూపంలో అందరికీ చేరువ అయిపోయి రచ్చ రచ్చ అయే అంతగా. ఇదంతా యూట్యూబ్ ద్వారా సాధ్యమవుతోంది.
గతంలో నేతలు ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఛానల్లు పలు దఫాలుగా ప్రసారం చేసేవి. అవసరం అనుకుంటే మళ్లీ వాడుకునేవి. అంతటితో ముగిసేది తప్ప సామాన్యులకు సదరు వివరాలు దొరకడం సాధ్యం కాకపోయేది. అయితే యూట్యూబ్ పుణ్యాన ప్రతి వీడియో ఇంటర్నెట్ లో అందుబాటులోకి వచ్చేస్తోంది. జస్ట్.... కీ వర్డ్స్ ఆధారంగా పాత కాలం నాటి పంచాయతీ అంతా బయటకు వస్తోంది. దీంతో సదరు కామెంట్లను పోస్ట్ చేసేయడమే కాకుండా ఆ సంభాషణల లింక్‌లు అన్నీ వాట్సప్ గ్రూప్‌లు - ఫేస్ బుక్ లు - గూగుల్ ప్లస్ - ఇన్ స్టాగ్రాంలలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో నాయకుల రచ్చ తేటతెల్లం అవుతోంది. ఈ నేపథ్యంలో నేతలు అడ్డంగా దొరికిపోతున్న పరిస్థితి. తాజాగా ఏపీలో ఇదే జరిగిందని అంటున్నారు. జల్లికట్టు స్పూర్తితో ఏపీలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తుంటే దీనిపై పలువురు నేతలు సెటైర్లు వేశారు. జల్లికట్టు స్పూర్తి అయితే కోడిపందాలో..పందుల పందాలో పెట్టుకోవచ్చు కదా అంటూ కామెంట్లు వదిలారు. ఇలా ఆకాంక్షను జోకులతో జమ కట్టిన సదరు నాయకుల కామెంట్లు ఇపుడు అందరికీ చేరువ అయిపోయి ప్రలజ ఆకాంక్షను పలుచన చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సామాన్య మీడియా కంటే సోషల్ మీడియా సత్తా ఏమిటో తెలిసి వస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/