వైఎస్‌ జగన్‌ సంచలన ప్రకటన.. ఇక 5.20 లక్షల మంది గ్రామ సారథులు!

Update: 2022-12-08 12:54 GMT
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరిట వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు వారి నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ గడప గడపకు తిరుగుతున్నారు. ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన లబ్ధిని వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమకే ఓట్లు వేసి గెలిపించాలని విన్నవిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమీక్షించడంతో పాటు మరిన్ని సూచనలు చేయడానికి ఏపీ సీఎం జగన్‌ వైసీపీ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్లతో తాజాగా భేటీ అయ్యారు. ఈ కీలక భేటీలో ఆయన అనేక సూచనలు చేసినట్టు తెలిసింది.

ప్రస్తుతం ఉన్న వలంటీర్ల మాదిరిగానే పార్టీ కోసం 5.20 లక్షల మంది గ్రామ సారథులను నియమించాలని జగన్‌ పార్టీ నేతలను ఆదేశించారు. ప్రతి 50 ఇళ్లను క్లస్టర్‌గా భావిస్తారు. క్లస్టర్‌కు ఇద్దరు చొప్పున గ్రామ సారథులను నియమించాలని జగన్‌ పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు.

అలాగే ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్‌లు ఉండేలా నియామకం చేపట్టాలన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ చొప్పున గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు 5.20 లక్షల మంది గ్రామ సారథులు ఉంటారు. వీరు క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి, ప్రజలు ఏమనుకుంటున్నారు? గ్రామ స్థాయి నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయడం తదితర అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తారని సమాచారం.

అలాగే బూత్‌ లెవల్‌ నుంచి పార్టీ పరిస్థితి, ప్రత్యర్థి పార్టీల బలాబలాలు తదితర అంశాలపైన కూడా గ్రామ సారథులు నివేదిక ఇస్తారని అంటున్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ప్రవేశపెట్టిన వలంటీర్‌ వ్యవస్థ మాదిరిగానే ఈ గ్రామ సారథులు ఉంటారు. వలంటీర్‌ వ్యవస్థతో ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చామని భావిస్తున్న జగన్‌.. గ్రామ సారథుల ద్వారా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 5.20 లక్షల మంది గ్రామ సారథుల నియామకానికి శ్రీకారం చుట్టారని చెబుతున్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సమావేశానికి అన్ని నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో నేతలకు సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News