జ‌గ‌న్‌ పై సీబీఐది వితండ వాద‌నేన‌ట‌!

Update: 2017-09-08 13:49 GMT
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై న‌మోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ వితండ వాద‌న చేస్తోంద‌న్న విమ‌ర్శ‌లు మ‌రోమారు కాస్తంత గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. త‌న‌పై న‌మోదైన అక్ర‌మాస్తుల కేసులో భాగంగా జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్‌ కు సంబంధించిన వ్య‌వ‌హారంలో దాఖలైన చార్జిషీట్ నుంచి త‌న పేరును తొల‌గించాల‌ని జ‌గ‌న్ డిశ్చార్జీ పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించాల‌న్న కోర్టు ఆదేశాల‌తో కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా కౌంట‌ర్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో సుదీర్ఘ వాద‌న‌లు జ‌రిగాయి.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించేందుకు వ‌చ్చిన సీనియ‌ర్ న్యాయ‌వాది ఉమామ‌హేశ్వ‌ర‌రావు... సీబీఐ కోర్టు న్యాయ‌మూర్తి ముందు సుదీర్ఘంగా వాద‌న‌లు వినిపించారు. అస‌లు త‌న క్లెయింట్ చేస్తున్న వాద‌న‌పై సీబీఐ వితండ వాద‌న‌నే వినిపిస్తోంద‌ని ఆయ‌న కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు. జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్‌ కు సంబంధించి పెట్టుబ‌డుల వ్య‌వ‌హారంలో క్విడ్ ప్రొకో గానీ - ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు కూడా ఏమీ లేవ‌ని తెలిపిన ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. సీబీఐ మాత్రం అందుకు విరుద్ధ‌మైన వాద‌న‌ను వినిపిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హైకోర్టు ఆదేశాల‌కు పూర్తి విరుద్ధంగా సీబీఐ త‌న వాద‌న‌ను వినిపిస్తోంద‌ని తెలిపారు. అయినా పెట్టుబ‌డుల వ్య‌వ‌హారం పూర్తిగా కంపెనీల చ‌ట్టం ప‌రిధిలోని వ్య‌వ‌హార‌మ‌ని, పూర్తిగా వ్యాపార సంబంధిత అంశ‌మ‌ని కూడా ఆయ‌న కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

క్విడ్ ప్రొకో ఉంద‌ని చెబుతున్న సీబీఐ అందుకు త‌గ్గ ఆధారాల‌ను స‌మ‌ర్పించ‌లేని వైనాన్ని కూడా ఉమామ‌హేశ్వ‌ర‌రావు కోర్టు ముందుంచారు. పెట్ట‌బడులు పెట్టిన వారికి లాభాలు వ‌స్తే... అందులో క్విడ్ ప్రొకో ఎక్క‌డ ఉంటుందో త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని కూడా ఆయ‌న వాదించారు. ఈ విష‌యంపై ఎన్నిసార్లు త‌మ వాద‌న‌ను వినిపిస్తున్నా కూడా సీబీఐ తాను ప‌ట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా పాత వాద‌న‌నే వినిపిస్తోందని చెప్పారు. క్విడ్ ప్రొకో విధానంలో పెట్టుబ‌డులు పెట్టిన వారికి లాభాలు వ‌చ్చే అవ‌కాశాలే లేవ‌ని, అయితే జ‌గ‌తి పబ్లికేష‌న్స్‌లో పెట్టుబ‌డులు పెట్టిన పారిశ్రామిక‌వేత్త‌ల‌కు లాభాలు వ‌చ్చాయ‌ని, ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే తాము బ‌హిర్గతం చేశామ‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఈ సంద‌ర్భంగా సుదీర్ఘంగా కొన‌సాగిన విచార‌ణ నేప‌థ్యంలో కోర్టుకు హాజ‌రైన జ‌గ‌న్‌... ఓపిగ్గా ఉద‌యం నుంచి సాయంత్రం దాకా కోర్టులోనే ఉండిపోయారు. జ‌గ‌న్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి - ఐఏఎస్ అధికారిణి శ్రీ‌ల‌క్ష్మి త‌దిత‌రులు కూడా విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌ను ఆల‌కించిన కోర్టు... కేసు తదుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే... ఈడీ దాఖ‌లు చేసిన మ‌రో రెండు కేసుల్లో నుంచి కూడా త‌న‌ను తొల‌గించాలంటూ జ‌గ‌న్ స‌హా విజ‌య‌సాయిరెడ్డి కూడా కోర్టులో డిశ్చార్జీ పిటిష‌న్లు దాఖ‌లు చేశారు.
Tags:    

Similar News