జగన్ సంచలనం..బాబు ఇలాకాకు పురపాలిక హోదా!

Update: 2020-01-06 16:32 GMT
కుప్పం... ఈ పేరు వినగానే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఠక్కున గుర్తుకు వస్తారు. ఎందుకంటే... తాను పుట్టిన చంద్రగిరి నియోజకవర్గంలో తొలి సారి విజయం సాధించిన చంద్రబాబు... రెండో పర్యాయం ఓడిపోగానే... ఆ నియోజకవర్గాన్ని వదిలేసి తన సొంత జిల్లా చిత్తూరులో అలా ఓ మూలకు విసిరేసినట్టుగా, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి 1989లో వలస పోయారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏకంగా ఏడు సార్లు ఎన్నికలు జరిగితే... చంద్రబాబును ఆ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు. అంటే... బాబు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే... ఏడు సార్లు కుప్పం నుంచే గెలిచారన్న మాట. కుప్పం ఎమ్మెల్యే హోదాలోనే ఆయన సీఎంగా పద్నాలుగున్నరేళ్లు, విపక్ష నేతగా పదేళ్లు - మంత్రిగా కూడా అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాంటిది కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో అన్ని నియోజకవర్గాల కంటే ముందుండాల్సిందే కదా. కానీ... కుప్పంకు ఇప్పటిదాకా మునిసిపాలిటీ హోదా కూడా లేదు.

సరే... చంద్రబాబును ఇన్నేళ్లు గెలిపిస్తూ వచ్చిన కుప్పంకు చంద్రబాబు మునిసిపాలిటీ హోదా ఇవ్వకపోయినా... ఆయన రాజకీయ ప్రత్యర్థి - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం హోదాలో ఇఫ్పుడు కుప్పంకు మునిసిపాలిటీ హోదా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. నిజమా? అంటే... సోమవారం జరిగిన అధికారుల సమీక్షలో జగన్ కుప్పంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. కుప్పంను మునిసిపాలిటీగా మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. అంటే... నిత్యం తాను విమర్శలు గుప్పిస్తున్న తన ప్రత్యర్థి చంద్రబాబు నియోజకవర్గానికి జగన్ ఏకంగా మునిసిపాలిటీ హోదా ఇచ్చేస్తున్నారన్న మాట. అందుకే ఈ వార్త నిజంగానే ఆసక్తికరమని చెప్పక తప్పదు. కుప్పంతో పాటు తన సొంత జిల్లా కడపలో తన మామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురాన్ని కూడా మునిసిపాలిటీగా మార్చేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఇక పులివెందుల, తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ అధికారిని జగన్ నియమించారు. పులివెందుల జగన్ సొంత నియోజకవర్గం కాగా.. తాడేపల్లిలో సీఎం నివాసం ఉంది. మంగళగిరి ప్రజలు నారా లోకేశ్‌ను ఓడించి మరీ వైసీపీని గెలిపించారు. దీంతో ఈ నియోజకవర్గంపైనా జగన్ ప్రత్యేక దృష్టి సారించినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అటు చంద్రబాబు నియోజకవర్గానికి ఏకంగా మునిపిసాలిటీ హోదా ఇచ్చేస్తున్న జగన్... చంద్రబాబు తనయుడు బరిలోకి దిగి ఓడిన నియోజకవర్గం అభివృద్ధిపైనా ప్రత్యేకంగానే దృష్టి సారిస్తున్నారన్న మాట. ప్రత్యర్థుల నియోజకవర్గాలపై ఇంతగా దృష్టి సారిస్తున్న జగన్... వచ్చే ఎన్నికల నాటికి ఆ నియోజకవర్గాల్లో పాగా వేసేందుకే ఈ తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News