జ‌గ‌న్ రికార్డ్: 50 రోజులు..700 కిలోమీట‌ర్లు

Update: 2018-01-02 15:37 GMT
ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల యొక్క.. ప్రజల చేత.. ప్రజల కొరకు.., ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఉద్యమానికి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నడుం బిగించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తాజాగా మ‌రో రికార్డు సృష్టించారు. 700 కిలోమీటర్ల మార్కును కొద్దిసేపటి క్రితమే దాటారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం జమ్మిలవారిపల్లెలో 700 కిలోమీటర్లను పూర్తి చేశారు. ఈ సంద‌ర్భంగా పెట్రోల్ బంక్ స‌మీపంలో వైఎస్ జ‌గ‌న్ పార్టీ జెండాను ఆవిష్క‌రించి - నేరేడు మొక్క‌ను నాటారు. మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీటీఎం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి పులవండ్ల పల్లి - కాశీరావు పేట - వాల్మీకిపురం - ఐటీఐ కాలనీ - పునుగుపల్లి - విఠలం - టీఎమ్‌ లోయ మీదుగా జమ్మిలవారిపల్లి వరకు పాదయాత్ర కొనసాగింది.

గ‌తేడాది న‌వంబ‌ర్‌ 6న కడప జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన ప్రజాసంకల్పయాత్ర నవంబర్ 14న కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. క‌ర్నూలు జిల్లా ఆళ్లగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో 100 కిలోమీటర్లు మైలురాయి - డోన్ నియోజ‌క‌వ‌ర్గంలో 200 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటిన 21వ రోజు పాదయాత్రలో భాగంగా జననేత జగన్ 300 కిలోమీట‌ర్ల మైలు రాయిని కూడా కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గం బి.అగ్రహారం వద్ద పూర్తి చేసుకున్నారు. 29 రోజు పాదయాత్రలో భాగంగా అనంత‌పురం జిల్లా గుమ్మేపల్లిలో 400 కి.మీ మైలురాయిని చేరుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఉట్లూరు గ్రామంలో 500 కిలోమీటర్లు - డిసెంబ‌ర్ 24న అనంత‌పురం జిల్లా ఉట్లూరు వ‌ద్ద 600 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటారు. ఇవాళ చిత్తూరు జిల్లా జ‌మ్మివారిప‌ల్లెలో 700 కిలోమీట‌ర్లు పూర్తి చేశారు. ప్ర‌తి వంద కిలోమీట‌ర్ల‌కు ఒక మొక్క‌ను నాటుతూ ముందుకు సాగుతున్నారు. జ‌న్మ‌దిన వేడుక‌లు, ప‌ర్వ‌దినాలు కూడా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్యే జ‌రుపుకుంటూ - వారితోనే గ‌డుపుతున్నారు.

కాగా, జ‌గ‌న్ యాత్ర పట్ల పార్టీ వ‌ర్గాల్లో ఉత్సాహం క‌నిపిస్తోంది. జ‌గ‌న్ యాత్ర‌లో ప్రధానంగా యువ‌త‌ - మ‌హిళ‌లు - మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు మెజార్టీగా హాజ‌ర‌వుతుండ‌టం వైసీపీ వ‌ర్గాలకు మ‌రింత ఉత్సాహాన్ని అందిస్తోంది. భూసేకరణ ప్ర‌జా కంట‌కంగా మారింద‌ని - కబ్జాలు పెరిగిపోయాయని - నిరుద్యోగులకు ఉద్యోగం లేక - ఇస్తానన్న నిరుద్యోగభృతి కూడా అందక వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని చెప్తున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ బ‌లోపేతం ప‌రంగా కూడా వైఎస్ జ‌గ‌న్ ప్లాన్ చేశార‌ని చెప్తున్నారు. దివంగ‌త వైఎస్ హ‌యాంలో అమ‌ల్లో ఉన్న కీల‌క సంక్షేమ ప‌థకాలు ఇప్పుడు అట‌క ఎక్క‌డంపై ప్ర‌జ‌ల్లో ఉన్న అసంతృప్తి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. 108 అంబులెన్సు - పేదలకు ఉచిత వైద్యం ఇచ్చిన ఆరోగ్యశ్రీ - విద్యార్థుల భవతకు బంగారు బాటలు వేసిన ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాలన్నీ ఇప్పుడు అగ‌మ్య గోచ‌ర స్థితిలో ఉన్నాయ‌నే భావ‌న జ‌గ‌న్‌ ను క‌లిసిన వారు వెల్ల‌డిస్తున్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోందని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags:    

Similar News