సీఎం జగన్ సంచలనం.. కరోనాతో చనిపోతే రూ.15వేలు సాయం

Update: 2021-05-17 02:21 GMT
సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాజాగా సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించారు. కొవిడ్ కారణంగా ఎవరైనా మరణిస్తే రూ.15వేల సాయం అందిస్తామంటూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ కారణంగా మరణిస్తే.. వారి అంత్యక్రియలకు రూ.15వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. కరోనా కారణంగా పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకోవటం.. చనిపోయిన వారి తరఫున ఎవరూ ముందుకు రాకపోవటంతో అంతిమసంస్కారాలకు నోచుకోలేక పెద్ద ఎత్తున శవాలు గుట్టలుగుట్టలుగా ఆసుపత్రుల్లో మూలుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం రూ.15వేల సాయాన్ని అందించనున్నట్లుగా ఏపీ సర్కారుకు తాజాగా అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆదివారం ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ జీవో నెంబరు 236ను విడుదల చేశారు. కొవిడ్ కారణంగా మరణించిన వారి అంత్యక్రియల కోసం రూ.15వేల మొత్తాన్ని అందజేయనున్నారు.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాదిరి కరోనా నిర్దారణ పరీక్షలు అరకొర కాకుండా.. పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీంతో.. కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆదివారం 24 గంటల వ్యవధిలో 94550 మందికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 24,171 మందికి పాజిటివ్ గా తేలింది. అధికారిక లెక్కల ప్రకారం కరోనా కారణంగా ఆదివారం ఒక్కరోజునే 101 మంది మరణించినట్లుగా గుర్తించారు. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. భారీగా మరణాలు చోటు చేసుకొని.. అంతిమ సంస్కారాలకు నోచుకోని వేళ.. జగన్ సర్కారు అనూహ్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
Tags:    

Similar News