గన్ సర్కారు ‘అభయం’ ఎవరికి మేలు? అసలేం జరుగుతుంది?

Update: 2020-11-23 16:30 GMT
సంక్షేమ పథకాల్ని మహా జోరుగా అమలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అక్కడితో ఆగకుండా మరిన్ని సౌకర్యాల్ని ప్రజల చెంతకు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. తాజాగా మరో పథకాన్ని షురూ చేశారు. ఆటోలు.. క్యాబుల్లో ప్రయాణించే మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు వీలుగా జగన్ సర్కారు.. ‘అభయం’ పేరుతో కొత్త ప్రాజెక్టును తెర మీదకు తీసుకొచ్చింది.

ఇంతకీ ఈ ప్రాజెక్టులో భాగంగా ఏం చేయనున్నారు? అన్న విషయంలోకి వెళితే.. ఆటోలు.. ట్యాక్సీలకు ట్రాకింగ్ పరికరాల్ని అమర్చనున్నారు. దీంతో ఏదైనా ఆపదలో చిక్కుకుంటే.. కేవలం పది నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకునేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ పథకాన్ని రవాణా శాఖ పరిధిలో పని చేయనున్నారు.

ట్రాకింగ్ పరికరాలు అమర్చిన వాహనాల్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. ఆటోలు కానీ క్యాబ్ లలో కానీ ప్రయాణిస్తున్న మహిళలు కానీ చిన్నారులు కానీ తమకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు.. ప్యానిక్ బటన్ ను నొక్కితే చాలు.. పోలీసులకు క్షణాల్లో సమాచారం అందుతుంది. ఆ వెంటనే..ఘటనాస్థలానికి పోలీసులు చేరుకునే వీలుంది.

ప్రయోగాత్మకంగా తొలుత వెయ్యి ఆటోలకు ఈ ట్రాకింగ్ పరికరాల్ని అమర్చనున్నారు. వచ్చే ఫిబ్రవరి 1 నాటికి ఐదు వేల వాహనాలకు.. జులై 1 నాటికి యాబై వేల వాహనాలకు.. వచ్చే ఏడాది నవంబరు 31 నాటికి రాష్ట్రంలోని లక్ష వాహనాలకు ఈ పరికరాల్ని అమరుస్తారు. ఇంతకీ ఈ ప్యానిక్ బటన్ ఎక్కడ ఉంటుందంటారా? సింఫుల్ గా మీ మొబైల్ లో అభయం మొబైల్అప్లికేషన్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. వాహనం ఎక్కే ముందు వాహనానికి అంటించిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే.. డ్రైవర్ ఫోటో.. వాహనం వివరాలు మొబైల్ కు వస్తాయి. వాటిని సరి చూసుకొని వాహనం ఎక్కొచ్చు. తమ ప్రయాణంలో ఏమైనా ఇబ్బంది ఎదురైతే.. పానిక్ బటన్ నొక్కితే.. జీపీఎస్ ద్వారా చూసి.. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకునే వీలుంది. ఈ పథకంలో భాగంగా ఆటోలు.. క్యాబ్ డ్రైవర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ కార్డులను ఇస్తారు. మహిళల భద్రతలో మేలు చేసే ఈ పథకం.. జగన్ సర్కారు సమర్థతను తెలియజేస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News