దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌.. ఆస్తులు ఎంతంటే!

Update: 2022-12-29 05:30 GMT
దేశంలోనే ప్రముఖ పరిశోధనాత్మక న్యూస్‌ వెబ్‌ సైట్‌.. ద ప్రింట్‌ సంచలనాత్మక కథనం వెలువరించింది. 30 మందవి ముఖ్యమంత్రులు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్స్‌ ఆధారంగా ఈ కథనాన్ని ఇచ్చింది. దీని ప్రకారం.. దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నిలిచారు. రూ.370 కోట్ల ఆస్తులతో జగన్‌ దేశంలోనే ధనిక సీఎంగా ఉన్నారని ద ప్రింట్‌ పేర్కొంది. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులతోపాటు రాజకీయాల్లోకి రాకముందు నిర్వహించిన వ్యాపారాల ద్వారా జగన్‌ ఈ మొత్తం సంపాదించాడని ప్రింట్‌ పేర్కొంది.

ఇక వైఎస్‌ జగన్‌ తర్వాత స్థానంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ నిలిచారు. ఈయన ఆస్తులు రూ.132 కోట్లు ఉన్నాయి. మొత్తం 30 మంది ముఖ్యమంత్రుల్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినవారిలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, పెమా ఖండు మాత్రమే ఉన్నారు.

ఇక ముగ్గురు భార్యలున్న ముఖ్యమంత్రిగా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేం సింగ్‌ టమాంగ్‌ గోలే నిలిచారు. అలాగే అందరికంటే ఎక్కువ చదువులు చదివిన ముఖ్యమంత్రి గా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉన్నారు.

ఇక అత్యంత పేద ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. మమత ఆస్తులు కేవలం రూ.15 లక్షలు మాత్రమే కావడం గమనార్హం. మమత తర్వాత స్థానంలో పేద ముఖ్యమంత్రిగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఉన్నారు. నితీష్‌ ఆస్తులు కూడా కేవలం రూ.56 లక్షలే కావడం గమనార్హం. అలాగే కేరళ సీఎం పినరయి విజయన్‌ ఆస్తులు కూడా కోటి రూపాయలలోపే ఉన్నాయి.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆస్తుల విలువ రూ.13.72 కోట్లుగా ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆస్తులు రూ.2.76 కోట్లుగా ఉన్నాయి. కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మైకి రూ.1.35 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ కు 7.18 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి.

ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్లో అయిదుమంది అవివాహితులు ఉండటం గమనార్హం. వారిలో మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌– హర్యానా, నవీన్‌ పట్నాయక్‌– ఒడిశా, యోగి ఆదిత్యనాథ్‌– ఉత్తర ప్రదేశ్, ఎన్‌.రంగస్వామి– పుదుచ్చేరి, మమత బెనర్జీ – పశ్చిమ బెంగాల్‌ అవివాహితులుగా ఉన్నారు.

ముఖ్యమంత్రులందరిలోనూ అత్యధిక క్రిమినల్‌ కేసులు ఉన్నది తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనే ద ప్రింట్‌ వెల్లడించింది. కేసీఆర్‌పై అత్యధిక క్రిమినల్‌ కేసులు 64 ఉన్నాయని తెలిపింది. ఈ కేటగిరీలో రెండో స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నిలిచారు. స్టాలిన్‌పై 47 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నారు. జగన్‌ పై 38 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.  అశోక్‌ గెహ్లాట్, మమత బెనర్జీ, నవీన్‌ పట్నాయక్, సంగ్మా, రియో, రంగస్వామిపై ఎలాంటి నేరారోపణలు లేవు. బీజేపీకి చెందిన 10 మంది ముఖ్యమంత్రులు కూడా క్లీన్‌ ఇమేజ్‌ తో ఉన్నారని ప్రింట్‌ పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News